
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. తమిళ సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది పెద్ద వివాదం అవుతోంది. తమిళనాడులో పెరియార్ అంటే చాలా పేరుంది. సమ సమాజం కోసం పాటుపడిన మహా సంఘ సంస్కర్తగా పేరు. బ్రాహ్మణ భావజాలం నుంచి సంఘాన్ని కాపాడిన మహనీయుడని తమిళులు కీర్తిస్తారు.
ఆధునిక తమిళనాడులో ఎందరో నేతలు పెరియార్ అనుచరులే. అలాంటి పెరియార్ గురించి రజినీకాంత్ తప్పుగా మాట్లాడారన్నది తాజా వివాదం. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ 1971లో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారన్నారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. పెరియార్ గురించి రజనీ తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పెరియార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రజనీ ఇంటి ఎదుట పెరియార్ ద్రవిడర్ కళగమ్ నలుపు రంగు దుస్తులు ధరించి నిరసనకు దిగారు.
అయితే.. సూపర్ స్టార్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. ‘1971లో ఏం జరిగిందో నేను చెప్పినదానిపై చర్చ జరుగుతోంది. అప్పుడు ఏం జరిగిందో మ్యాగజైన్లో వచ్చిన కథనాలను బట్టే నేను చెప్పాను. కానీ సొంతగా ఊహాజనిత విషయాలేవీ నేను చెప్పలేదు. వాటికి సంబంధించిన క్లిప్లింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ ఘటన గురించి నేనేమి చూశానో అదే చెప్పాను. దీనికి నేను క్షమాపణ చెప్పను’ అని రజనీకాంత్ అన్నారు.