గత అసెంబ్లీ సమావేశాల్లో ఏ ముహూర్తాన జగన్ మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించారో గానీ అప్పటినుండి మూడు రాజధానుల గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో, అన్ని పార్టీల రాజకీయ నేతల్లో మూడు రాజధానుల గురించే చర్చ జరిగింది. రాష్ట్రంలోని మెజారిటీ శాతం ప్రజలు జగన్ మూడు రాజధానుల నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 
 
జగన్ మూడు రాజధానుల ప్రకటనకు అనుకూలంగా జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలు వచ్చాయి. ఆ తరువాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కూడా మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందింది. కానీ శాసనమండలి సెలక్ట్ కమిటీకి మూడు రాజధానుల బిల్లును సిఫారసు చేయడంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాజధాని తరలింపుపై రాష్ట్రంలో తీవ్ర దుమారం కొనసాగుతోంది. 
 
మండలి మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ బిల్లును సెలక్ట్ కమిటీకి సిఫారసు చేయడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్ట్ కమిటీకి బిల్లులను సిఫారసు చేయటాన్ని తీవ్రంగా ఖండించిన జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని అన్నారు. రాజ్యాంగంలో సీట్ ఆఫ్ గవర్నెన్స్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించారని చెప్పారు. 
 
సీట్ ఆఫ్ గవర్నెన్స్ ను పరిపాలన కోసం డీ సెంట్రలైజ్ చేసుకోవచ్చని జగన్ అన్నారు. గతంలో జయలలిత అధికారంలో ఉన్న సమయంలో కొన్ని నెలలపాటు ఊటీ నుండి ప్రభుత్వాన్ని నడిపిందని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో విశాఖకు హుద్ హుద్ తుఫాను వస్తే విశాఖ నుండి పాలన చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడినుండే పరిపాలన చేసుకోవచ్చని ఇందుకోసం సభలో తీర్మానం చేస్తే చాలని చెప్పారు. దీనికి బిల్లుతో మరియు చట్టంతో పని లేదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడినుండైనా చట్టాలను చేసే అధికారం ఉందని జగన్ చెప్పారు. సీఎం జగన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే జగన్ సభలో తీర్మానం చేసి విశాఖ నుండి పరిపాలన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: