తెలంగాణ రాష్ట్రంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి ఆ తరువాత బిల్డింగ్ పై నుండి మైనర్ బాలికను తోసేశారు. రాత్రి చదువుకోవాలని భవనం పైకి వెళ్లిన బాలిక శవమై కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు బాలిక నివాసం ఉంటున్న భవనంపై రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించారు.                           
 
క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తోంది. దుండగులు బాలికపై అత్యాచారం జరిపి భవనంపై నుండి తోసేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక శరీరంపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతో అత్యాచారం జరిగిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు హత్య చేసినట్టుగా తేల్చినట్టు సమాచారం.          
 
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అరీఫా ఆమె సోదరుడు, సోదరి, తల్లితో కలిసి నివాసం ఉంటోంది. ఈరోజు ఉదయం భవనంపై ఒక మహిళ వెళ్లి రక్తపు మరకలు గుర్తించి అరీఫా కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 
 
కొన్ని నెలల క్రితమే అరీఫా తండ్రి మృతి చెందినట్టు తెలుస్తోంది. రెండు అపార్టుమెంట్ల మధ్య పడి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం తరువాత బాలిక హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: