తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 9 కార్పొరేషన్లలో మరియు 120 మున్సిపాలిటీలలో కౌంటింగ్ జరుగుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ మొదటి గంటలో చాలా చోట్ల ముందంజలో నిలిచింది. చెన్నూరు, పరకాల మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే బోణీ కొట్టింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో కారు కైవసం చేసుకుంది. హుజూర్ నగర్ ను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చింది. 
 
కొన్ని నెలల క్రితం జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బంపర్ మెజారిటీతో టీఆర్‌ఎస్ పార్టీ ఉపఎన్నికలో విజయం సాధించగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయింది. కనీసం మున్సిపల్ ఎన్నికలలోనైనా కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ లో ప్రభావం చూపుతుందనుకుంటే మరోసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. 
 
ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ ప్రభ తగ్గుతుందనే చెప్పవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా ఆ అంచనాలు కూడా తారుమారయ్యాయి. 
 
మరోవైపు పరకాల, చెన్నూరు, హుజూరాబాద్, బొల్లారం, సిరిసిల్ల, జవహర్ నగర్ మున్సిపాలిటీలు కూడా టీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో చేరాయి. పరకాలలోని 22 వార్డులలో చెన్నూరులోని 18 వార్డులలో టీఆర్‌ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇల్లందులో మాత్రం బ్యాలెట్ బాక్సుకు సీల్ లేకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలు పార్టీలు ఇల్లందులో బ్యాలెట్ బాక్సుకు సీల్ లేదని ఆందోళనకు దిగాయి. ఆదిబట్లలోని మూడు వార్డులను మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.              
 

మరింత సమాచారం తెలుసుకోండి: