ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ సమయంలో అసలు శాసన మండలిని ఎన్టీఆర్ రద్దు చేస్తే వైఎస్సార్ తిరిగి తెచ్చారు. అలాంటి దాన్ని ఆయన కొడుకు వైఎస్ జగన్ రద్దు చేయడమేంటి.. ఇదేనా వైఎస్సార్ వారసత్వం అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సమాధానం చెప్పారు.
ఆయన ఏమన్నారంటే.. “ నందమూరి తారక రామారావు అప్పట్లో మండలిని రద్దు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో మండలిని పునరుద్ధరించారు. మళ్లీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దు చేస్తున్నారు.ఈ పరిణామాలు గమనిస్తే..కాలానుగుణంగా అభిప్రాయాలు మారుతున్నాయి. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పడిన వైయస్‌ఆర్‌సీపీ ఆయన ఏర్పాటు చేసిన మండలిని ఎందుకు రద్దు చేశారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వారికి సమాధానం ఇదే.. అంటూ వివరణ ఇచ్చారు అంబటి రాంబాబు.
" కాంగ్రెస్ పార్టీ వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే కాదు..డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా మండలిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేసి విఫలమైంది. వైయస్‌ఆర్ సీఎం అయిన తరువాత కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకొని 2007లో పునరుద్ధరించింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఆ రోజు వైయస్ఆర్ అమలు చేశారు. వైయస్‌ఆర్ వారసుడిగా వైయస్ జగన్ వచ్చారు..కాంగ్రెస్ వారసుడిగా కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు అంబటి రాంబాబు.
" వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఆరోజు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ తీసుకుంది. వైయస్‌ఆర్‌సీపీకి మండలిని రద్దు చేయాలనే ఆలోచన ఎన్నికలకు ముందు లేదు. ఎన్నికల తరువాత అనివార్యమైన పరిస్థితిని కల్పించింది మండలిలో ఉన్న టీడీపీ నాయకత్వమేనని వివరించారు అంబటి రాంబాబు.