ప్రపంచంలోని దేశాలన్నింటినీ ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడితే బ్రతుకుతామో లేదో అనే పరిస్థితి నెలకొంది. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు. చైనాలోని వుహాన్ సిటీలో కరోనా వైరస్ వెలుగులోకి రాగా అక్కడినుండి ఆ వైరస్ ఇప్పటికే ఇతర దేశాలకు పాకింది. ఇప్పటికే దాదాపు 4000 మందికి ఈ వైరస్ సోకినట్టు అధికారికంగా తెలుస్తోంది.
106 మంది ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రపంచ దేశాలు వ్యాధి తీవ్రతను తగ్గించడానికి కృషి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమిళనాడులోని సిద్ధా ఆస్పత్రికి చెందిన థానికా చలమ్ వేణి అనే వైద్యుడు తాను కరోనా వైరస్ కు మందు కనిపెట్టానని చెప్పాడు. తనకు 25 సంవత్సరాల అనుభవం ఆయుర్వేద వైద్యంలో ఉందని వేణి చెబుతున్నాడు.
మీడియాతో థానికా చలమ్ వేణి మాట్లాడుతూ ఏ రకమైనా వైరల్ జ్వరాన్నైనా తగ్గించే ఔషధాన్ని హెర్బల్ ఆయిల్ నుండి తాము తయారు చేశామని చెప్పారు. ఈ ఔషధం వాడితే కరోనా వైరస్ ద్వారా వచ్చే జ్వరం కూడా ఇట్టే తగ్గిపోతుందని చెప్పారు. కరోనా వైరస్ ద్వారా వచ్చే వ్యాధిని హెర్బల్ ఆయిల్ నుండి తయారు చేసిన ఈ మెడిసిన్ తగ్గిస్తుందని లివర్ ఫెయిల్యూర్, ఆర్గాన్ ఫెయిల్యూర్ లాంటి వ్యాధులను కూడా ఈ ఔషధం తగ్గిస్తుందని చెప్పారు.
తన బృందంతో కలిసి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ ను సమూలంగా నిర్మూలించేందుకు ఈ మందును తయారు చేసినట్టు చెప్పారు. ఈ మందును వినియోగించిన 40 గంటల లోపు వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పారు. తమ ఔషధంతో అవసరమైతే చైనాలోని కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తామని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైరస్ విషయంలో సాయం అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని వేణి ప్రకటన చేశారు.