రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఎవరూ చెప్పలేరు !నిన్నటి వరకు పొగడ్తల వర్షం తో ముంచెత్తిన వారే ఈరోజు విరుచుకు పడే పరిస్థితి రాజకీయాల్లో సర్వ సాధారణంగా ఉంటుంది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ .ఆయనపై పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన రాపాక ఆ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటూ పవన్ కు వీర విధేయుడిగా ఉంటూ వచ్చారు.
కానీ ఆ తర్వాత పవన్ టీడీపీతో సన్నిహితంగా ఉండటం, అనుమానాస్పద రాజకీయాలు చేస్తుండడం, ఏ విషయం లో క్లారిటీ లేకుండా మాట్లాడటం, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు జగన్ ప్రభుత్వం ప్రవేశ పెడుతూ ఉంటే వాటిని అడ్డుకోవడం, తదితర వ్యవహారాలతో పవన్ తీరుపై విసుగెత్తిపోయారు రాపాక. విశాఖలో పవన్ నిర్వహించిన ఇసుక లాంగ్ మార్చ్ దగ్గర నుంచి రాపాక తన మనసు మార్చుకున్నాడు. వైసీపీతో సన్నిహితంగా ఉంటూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలను సమర్థిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆటోడ్రైవర్లకు పదివేల రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్ ను ప్రశంసిస్తూ ఆయన ఫోటోకు రాపాక పాలాభిషేకం చేయడం వంటి పరిణామాలు జనసేన ఆశ్చర్యానికి ఆందోళనకు గురి చేశాయి.
ఇక అప్పటి నుంచి పూర్తిగా వైసిపి ఎమ్మెల్యే గా వ్యవహరిస్తూ వచ్చారు. జగన్ ప్రవేశపెట్టిన మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడటం, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని సమర్ధించడం, తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలకడం, పార్టీ తరఫున బహిరంగ లేఖ రాసినా లెక్క చేయకపోవడం వంటివి చేస్తున్నారు. పవన్ నిర్వహిస్తున్న సభలు, సమావేశాలకు కూడా హాజరుకావడంలేదు. ఈ విషయంలో పవన్ మౌనంగానే ఉన్నా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం పవన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతూ ఆయనను పార్టీ నుంచి సాగనంపాలని కోరుతున్నారు. జనసేన పార్టీ వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందని, రాజోలు లో గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కేవలం 318 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటూ హేళన చేయడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి రాజోలు లో జనసేన కార్యకర్తల పూర్తిగా రాపాకను పక్కన పెట్టేశారు. ఇక ప్రభుత్వానికి ఆయన మద్దతుదారులు మారిపోవడంతో వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జనసైనికులు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ మాత్రం మౌనంగా రాపాక వ్యవహారాన్ని చూస్తున్నారు తప్ప ఆయనపై చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్ళలేక పోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.