ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదల చేసిన చేసిన తరువాత పరీక్షలను నిర్వహించి ప్రభుత్వం ఈ ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో జనవరి నెలలో ప్రభుత్వం మరోసారి మిగిలిన ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 
 
నిజానికి ధరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. కానీ నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7వ తేదీ వరకు పెంచినట్లు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం నిన్నటితో గడువు ముగిసిందని కానీ చాలా జిల్లాల నుండి గడువు పెంచాలని అభ్యర్థనలు రావడంతో గడువు పెంచామని గిరిజా శంకర్ చెప్పారు. 
 
మరోవైపు ప్రభుత్వం గ్రేడ్ 2 గ్రామ వ్యవసాయ సహాయక పోస్టులకు విద్యార్హతలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్హతలను సవరించడం వలన దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని భావించి దరఖాస్తు గడువును పెంచామని గిరిజా శంకర్ చెప్పారు. పంచాయతీరాజ్ కార్యాలయాలలో చాలా సంవత్సరాలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేస్తున్న వారికి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని గిరిజా శంకర్ చెప్పారు. 
 
డిగ్రీ కలిగి ఉండి ఏదైనా పేరు పొందిన శిక్షణ కేంద్రంలో కంప్యూటర్ కోర్సు చేసినట్లు ధ్రువపత్రం ఉంటే వారిని కూడా డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ప్రతిపాదించామని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వం నుండి ఈ ప్రతిపాదనలకు అనుమతులు వచ్చిన వెంటనే అధికారికంగా ఈ విషయాల గురించి ప్రకటన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంచటం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: