కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఈ మేరకు భారీగా మార్పులు చేశారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ లో డివిడెండ్ ట్యాక్స్ ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటన చేశారు. 2020 - 2021 సంవత్సరానికి ద్రవ్యలోటు 3.5 శాతానికి కుదిస్తున్నట్టు చెప్పారు. 2019 - 2020 ద్రవ్యలోటును 3.9 శాతం నుండి 3.5 శాతం వరకు కుదిస్తున్నట్టు చెప్పారు. 
 
5 లక్షల రూపాయల నుండి 7.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్ను, 7.5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 15 శాతం పన్ను, 10 లక్షల రూపాయల నుండి 12.5 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారికి 20 శాతం పన్ను, 12.5 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు ఆదాయం ఆర్జించేవారు 25 శాతం పన్ను చెల్లించాలని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 
 
15 లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పాత లేదా కొత్త పన్ను విధానాలలో ఏదైనా ఉద్యోగులు ఎంచుకోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. రెండు విధానాలు అమలులో ఉంటాయని ప్రకటన చేశారు. కొత్త ఆదాయపు పన్ను విధానం ఐచ్చికం అని నిర్మలా సీతారామన్ అన్నారు. వేతన జీవుల నిర్ణయంపై మినహాయింపులు పొందాలా...? వద్దా...? అనేది ఆధారపడి ఉంటుందని అన్నారు. 
 
కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకున్న వారికి 80 సి కింద వచ్చే మినహాయింపులు రావని నిర్మలా సీతారామన్ చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. పన్ను ఎగవేత విషయంలో త్వరలో చట్ట సవరణ చేయనున్నట్టు చెప్పారు. బ్యాంకుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలని డిపాజిట్ ఇన్సూరెన్స్ ను లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నామని అన్నారు. పన్ను చెల్లింపుల్లో రెండు విధానాలను అమలులోకి తీసుకొనిరావడం ద్వారా నిర్మలమ్మ భలే మెలిక పెట్టిందని ఉద్యోగుల నుండి అభిప్రాయాలు వ్యకతమవుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: