కేంద్ర బడ్జెట్ మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొన్ని కొన్ని అంశాల్లో కేటాయింపులు బాగానే ఉన్నా ముఖ్యమైన వాటి లో సరైన కేటాయింపులు లేకపోవడంపై ఏపీ అధికార పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఏపీకి ఎన్నో వరాల జల్లులు కురుస్తాయనుకుంటే తెలుగింటి కోడలు ఏపీకి అన్యాయం చేసింది అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఏపీకి ఈ బడ్జెట్లో సరైన విధంగా కేటాయింపులు దక్కలేదని, బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు తగ్గువగా చేసారంటూ వైసిపి పెదవి విరుస్తోంది. దీనిపై వైసీపీ నాయకులు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు.


 ఇదే విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మీడియా తో మాట్లాడారు. బడ్జెట్లో కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ముందుగా చెప్పారని అయితే ఈ విధానంలో సరైన క్లారిటీ ఇవ్వలేకపోవడం అందరిని గందరగోళంలోకి నెడుతోందన్నారు. ఇక ఏపీకి నిధులు కేటాయించడంలో కేంద్రం పక్షపాత ధోరణి చూపించింది అంటూ పలువురు వైసీపీ నాయకులు ఈ బడ్జెట్ పై పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంపై ఉన్న పక్షపాత ధోరణి కారణంగా ఏపీకి ఎలా అన్యాయం చేయడం తగదని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.


 రాష్ట్రానికి ఒక రైల్వే ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదని, ప్రత్యేక హోదా తో పాటు అనేక కీలక అంశాల గురించి ఇప్పటికే అనేకసార్లు ప్రస్తావించినా బడ్జెట్ లో మాత్రం ఏ కేటాయింపులు చేయకుండా మొండిచేయి చూపారు అంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై బిజెపి కూడా తమ స్పందన తెలియజేసింది. బడ్జెట్ లో కేటాయింపులు లేకపోయినా ఎవరూ కంగారు పడనవసరం లేదని, ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుంది అంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. అయితే బడ్జెట్ లో కేటాయింపులు చేయకుండా ఆ తర్వాత ఎప్పుడో చేస్తామంటే ఎలా కుదురుతుంది అంటూ వైసీపీ నాయకులు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: