మోసం... దగా... కుట్ర. ఏంటి బావ పొద్దు పొద్దున్నే పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నావ్. ఏమీ లేదు రా బామ్మర్ది జగన్ నా మీద కుట్ర చేస్తున్నాడు రా...! ఏం చేసాడు బావ చెప్పు వెంటనే రంగంలోకి దూకుతాను. వద్దు రా బామ్మర్ది ఇప్పటికే ఆ జగన్ ను, బీజేపీని తక్కువ అంచనా వేసి ఇలా బొక్క బోర్లా పడ్డాను. నువ్వు రంగంలోకి దిగావంటే మొత్తం టెన్షన్ తో నరాలు తెగిపోతాయి. బీపీ కూడా పెరిగిపోతుంది. అసలు ఏమైంది బావా..? మనం ఎన్ని ఎత్తులు వేసినా ఆ జగన్నాథ చక్రం మన ఎత్తులను చిత్తు చేసేస్తోంది కదరా ! పోనీ ఆ పువ్వు పార్టీతో పొత్తు పెట్టుకుందామా అంటే మన దత్తపుత్రుడు మనతో ఉంటే లాభం లేదని ఇప్పటికే వాళ్ళతో పొత్తు పెట్టుకుని ముందుకు వెనక్కి వెళ్లలేక మధ్యలోనే ఆగిపోయాడు.
అసలు రాజకీయాల్లో నా అంత సీనియర్ ఉన్నాడా..? దక్కా ముక్కీలు తిన్న నాకే ఇప్పుడు ఈ రాజకీయాలు అర్థం కావట్లేదు రా ! నన్ను దెబ్బ కొట్టడానికి నా దత్తపుత్రుడిని చేరదీసి ఆ పువ్వు పార్టీ చేయబోయే రాజకీయం నాకు అర్ధం అయ్యింది. మొన్నటి వరకు హాయిగా నీకు నేను ..నాకు నువ్వు అన్నట్టుగా 'రాజీ'కీయాలు చేసుకున్నాం ఇప్పుడు గందరగోళం అయిపొయింది బామ్మర్ది. ఛీ ఛీ ఏంటి బావా..! మాట్లాడితే చాలు ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అంటావు. ఈ ఏడు నెలలకే ఇలా అయిపోతే ఎలా ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. ఏంట్రా నువ్వు నన్ను భయపెడుతున్నావా ? లేక ధైర్యం చెబుతున్నావా ? ఏమిటో అర్థం కావట్లా ! అదేంటి బావా అలా అంటావ్.
నీ తర్వాత ఎప్పటికైనా కుర్చీలో కూర్చోవల్సింది నేనే కదా ! ఏంటి అప్పుడే నా కుర్చీ మీద కన్నేశావా ? ఇప్పుడేంటి బావా ఎప్పుడో వేశా. ఓ సారి నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు కూర్చున్నా కదా నీ కుర్చీలో అప్పుడు అందరూ గోల గోల చేసారని లేచాలే. అయినా నా అల్లుడు వట్టి సుద్దపప్పు కదా ! వాడికంటే నేనే బెటర్. అయినా ఏంటో రా బామ్మర్ది 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దుస్థితి ఎప్పుడు రాలేదు.
సిగ్గు విడిచి మరీ ఆ పువ్వు పార్టీతో పొత్తు పెట్టుకుందామంటే వాళ్ళు నన్ను నమ్మి చావడంలేదు కదా నిన్ను ఎవరూ నమ్మరు బావా ..! ఎందుకంటే ఆ పువ్వు పార్టీ పెద్దలకు చేసిన అవమానాలు అన్నీ ఇన్నీనా ? వాళ్ళ కార్ల మీద రాళ్ళేయించావు కదా. అవును నిజమేరో. ఆ కోపం తగ్గించడానికి మన పార్టీ తో పొత్తు పెట్టుకునేలా చేయడానికి నా బినామీలను ఆ పార్టీ లోకి పంపించి కూల్ చేస్తున్నా ఆళ్లు మాత్రం జగన్ నామస్మరణ చేస్తున్నారు. ఏంటి బావ ఆ పువ్వు పార్టీ వాళ్ళు అంత చేస్తుంటే నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు నేను ఒకసారి మీటింగ్ లో హమ్ హమారా .. ఇస్ లోగోంకో... అంటూ స్పీచ్ ఇచ్చేటప్పటికి వాళ్ల కి దిమ్మ తిరిగి పోయింది కదా. అవును అవును తిరిగిపోయింది.
నువ్వు మాట్లాడింది హిందీయా, తమిళమా, మరాటీనా అనేది తెలియక అందరూ జుట్టు పీక్కున్నారు లే. మరి ఏమనుకున్నావ్ బావ నా దెబ్బంటే... సీమ సింహ..బొబ్బిలి సింహ మొత్తం అన్ని సింహాలు నేనే బావా. నీ టాలెంట్ నాకు తెలుసమ్మా ! అందుకే నా పక్కన నిన్ను పెట్టుకోవడం లేదు. నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు అలాంటి డైలాగులు మళ్లీ చెప్పావంటే మన పార్టీ వాళ్ళు కూడా మన దరిదాపుల్లో కి రారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం బావ వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసి ఆ పువ్వు పార్టీ పెద్దల కాళ్ల మీద పడిపోదాం అప్పుడు గాని వాళ్లు దారిలో కి రారు. ఒక వేళ అలా పడినా ఛీ.. పో అన్నారనుకో ఏం చెయ్యాలి బామ్మర్ది ..? సరి సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి ?