కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కొరకు మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నెలకు 20,000 లీటర్ల మంచినీటిని 300 యూనిట్ల కరెంట్ ను ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రకటించగా కాంగెస్ పార్టీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రకటించటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం కింద ఇచ్చే గోధుమ, బియ్యంలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది.
ఈ రిక్షాలు, ఆటోలపై కూడా రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో డిగ్రీ చదివిన వారికి నెలకు 5,000 రూపాయల నిరుద్యోగ భృతి, పోస్ట్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి నెలకు 7,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం గమనార్హం. సీనియర్ సిటిజన్లకు 5,000 రూపాయలు ప్రతి నెలా పెన్షన్ అందిస్తామని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రధానంగా పేదలు, చిన్నారులు, వృద్ధులు, యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందించటం గమనార్హం. ఢిల్లీ ప్రభుత్వ నిధులలో 25 శాతం నిధులను ఢిల్లీలో పర్యావరణాన్ని మెరుగుపరచడం కోసం ఖర్చు పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ సిటీగా ఢిల్లీని మారుస్తామని పచ్చదనాన్ని 6 నుండి 20 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రతి సంవత్సరం మహిళలకు ఒకసారి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. 100 ఇందిరా క్యాంటీన్లను ఢిల్లీలో మహిళలతో నడిపిస్తామని పేర్కొంది. రాబోయే ఐదు సంవత్సరాలలో పది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని 181 హెల్ప్ లైన్ నంబర్ ను తిరిగి అందుబాటులోకి తెస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.