కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. దాదాపు 300 మందిని పొట్టన పెట్టుకున్న వైరస్.. మరో 3 వేల మందికి ప్రాణాంతకంగా మారింది. ఇప్పుడు దీన్ని కట్టడి చేయడం ఎలా అని వైద్యులంతా తలలు పట్టుకుంటున్నారు. అయితే ఏపీని కరోనాను మించి న వైరస్ వేధిస్తోందట. ఈ విషయం సాక్షాత్తూ ఏపీ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆ వైరస్ ఏంటో తెలుసా.. అదే ఎల్లో వైరస్ అట.
చైనాలో కరోనా వైరస్ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో వైరస్ విజృంభించిందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలపై ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సంక్షేమ పథకాలతో కోటిమందికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కన్నా ‘ఎల్లో’ వైరస్ మరింత ప్రమాదకరమైనదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో 39 లక్షల మందికి ఇచ్చే పెన్షన్లను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 54 లక్షల మందికి పెంచారని మంత్రి కొడాలి నాని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.1000 పెన్షన్‌ను రూ.2,250కి పెంచిందని గుర్తుచేశారు. పెన్షన్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లతో ఇంటి వద్దనే అందచేస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే పెన్షన్లపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాల్లో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు.