తెలుగుదేశంపార్టీ, ఎల్లోమీడియాకు అధికార పార్టీ ఒకేసారి షాకిచ్చింది. ఆ షాకు నుండి ఎలా బయటపడాలో అర్ధంకాకుండా రెండూ గిలగిల్లాడుతున్నాయి. చంద్రబాబునాయుడు సొంత గ్రామం నారావారిపల్లెలో ఆదివారం నాడు వైసిపి నిర్వహించిన బహిరంగసభ తాజా ప్రకంపనలకు మూల కారణమైంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు మొన్నటి వరకూ ఎంత యాగీ చేసింది అందరూ చూసిందే.
చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందులో భాగంగానే చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి నారావారిపల్లెలో బహిరంగసభ నిర్వహించారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నట్లు చెవిరెడ్డి ముందుగానే ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎంఎల్ఏలను ఆహ్వానించారు.
బహిరంగసభ అన్నాక మెయిన్ టార్గెట్ చంద్రబాబే కదా. అనుకున్నట్లుగానే మాట్లాడిన వాళ్ళందరూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన సభ విజయవంతం అవ్వగానే టిడిపిలో కలవరం మొదలైంది. ఎప్పుడైతే సభ విజయవంతమైందని అర్ధమైపోయిందో వెంటనే ఎల్లోమీడియా రంగంలోకి దిగేసింది. బహిరంగసభకు అసలు జనాలే రాలేదంటూ ఖాళీ కుర్చీలున్న ఫొటోలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అలాగే టిడిపి నేతలు కూడా నారావారి పల్లెలో వైసిపి సభ నిర్వహించటమే మహాపాపం అన్నట్లు విరుచుకుపడుతున్నారు.
సభ ప్రారంభానికి ముందో లేకపోతే అయిపోయిన తర్వాతో తీసిన ఫొటోలను ప్రచారం చేస్తోంది ఎల్లోమీడియా. మిగిలిన మీడియాలో మాత్రం సభ విజయవంతమైందని వార్తలు వచ్చాయి. కాకపోతే చెవిరెడ్డి చెప్పినట్లుగా 25 వేలమంది రాకపోయినా మొత్తానికి బహిరంగసభ బాగా జరిగిందనే రాశాయి. ఇక టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అండ్ కో మాట్లాడుతూ చంద్రబాబు సొంతూరులో వైసిపి సభ నిర్వహించటమేంటూ వాదన మొదలుపెట్టటమే విచిత్రంగా ఉంది.
అసలు చంద్రబాబే సొంత నియోజకవర్గాన్ని వదిలేసి దాదాపు 30 ఏళ్ళవుతోంది. అప్పటి నుండి చంద్రగిరిలో టిడిపి గెలిచిందే లేదు. వాస్తవం ఇలాగుంటే వైసిపి సభ నిర్వహిస్తే టిడిపితో పాటు ఎల్లోమీడియా ఎందుకు వణికిపోతున్నాయో ? బహిరంగసభ ఫెయిలైందని ఎందుకు ప్రచారం చేస్తున్నాయో అర్ధం కావటం లేదు.