జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో సర్వీస్ అతి త్వరలో హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ ఈ నెల 7వ తేదీన జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గాన్ని ప్రారంభించనుండటంతో హైదరాబాద్ లో మొత్తం 67 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నట్టు కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గం అతి ముఖ్యమైనది. నిజానికి గతంలోనే ఈ మార్గం ప్రారంభం కావాల్సి ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కారిడార్ ప్రారంభం వాయిదా పడగా ఎన్నికలు ముగియడంతో ప్రారంభానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవసరమైన అనుమతులు సైతం వచ్చేశాయి.
అధికారులు ఈ మార్గం అందుబాటులోకి రావటం ద్వారా మరో లక్ష మంది ప్రయాణికులు జతకానున్నట్టు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గంలో టెస్ట్ రన్, ట్రయల్ రన్ లు విజయవంతంగా పూర్తయ్యాయి. మెట్రో సేవలు ఈ మార్గంలో అందుబాటులోకి వస్తూ ఉండటం వలన ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరనున్నాయి.
మెట్రో రైలులో కేవలం 16 నిమిషాలలో ఈ మార్గంలో ప్రయాణించవచ్చని అదే రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాలంటే 45 నిమిషాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మెట్రో మార్గం ద్వారా ఎంజీబీఎస్, జేబీఎస్ లకు వచ్చే ప్రయాణికులు సులువుగా వారి గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. ఈ మార్గం అందుబాటులోకి రావడం ద్వారా ఐటీ ఉద్యోగులకు ఎంతో ఊరట కలగనుంది.
Hon’ble cm Sri kcr Garu will inaugurate the JBS-MGBS Metro 🚇 line on 7th Feb at 4pm
— ktr (@KTRTRS) February 4, 2020
This will take the total length of hyderabad Metro rail to 69 KM @ltmhyd @hmrgov