ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ ఫిరాయింపులపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులన్నది రోత పనులట. పార్టీ ఫిరాయింపులన్నది అనైతిక రాజకీయాలట. ఇటువంటి అనైతిక, రోత పనులకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందంటూ తెగ బాధపడిపోయారు వెంకయ్య. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోమంటూ కేంద్రప్రభుత్వానికి సూచించటమే విచిత్రంగా ఉంది. నీతి మాలిన, రోత పనులను అరికట్టేందుకు అన్నీ పార్టీలు ముందుకు రావాలంటూ మహాగొప్పగా వెంకయ్య సూచించారు. ఇలాంటి అంశాల్లో ప్రిసైడింగ్ అధికారులు, కోర్టులు, తదితర వ్యవస్ధల వల్ల చాలా సమయం పడుతోందంటూ పెద్ద నీతులు చెప్పారు.
నిజానికి పార్టీ ఫిరాయింపులను అరికట్టటం పెద్ద విషయం ఏమీ కాదు. వెంకయ్య సూచించినట్లు అన్నీ పార్టీలు ఈ విషయంలో కలిసి వచ్చే అవకాశమే లేదు. చట్టం లేకపోతే న్యాయ వ్యవస్ధ ద్వారానే ఇటువంటి అనైతిక చర్యలకు అడ్డు కట్టవేయాలంతే. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీలే ఇటువంటి రోత, అనైతిక చర్యలకు పాల్పడితే అడ్డుకునే వారెవరు ?
ఇన్ని నీతులు చెబుతున్న వెంకయ్యనాయుడు మాత్రం ఇటువంటి రోత పనులు చేయలేదా ? కేంద్రమంత్రిగా ఉన్నంత కాలం ఏపిలో చంద్రబాబునాయుడు యధేచ్చగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు ? చంద్రబాబుకు బుద్ధులు చెబితే ఎవరైనా వద్దన్నారా ? కేంద్రమంత్రిగా ఉన్నంత కాలం ఇటువంటి రోత పనులను చూస్తు ఎంజాయ్ చేసిన వెంకయ్య ఉపరాష్ట్రపతిగా అవ్వగానే బుద్ధులు చెప్పటం మొదలుపెట్టారు.
పోనీ బుద్ధులు చెప్పే స్ధాయిలో ఉన్నారు కాబట్టి ఆయనేమన్నా నైతిక విలువలను పాటించారా ? 2019లో కేంద్రంలో నరేంద్రమోడి రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. వెంటనే టిడిపి నుండి నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయిస్తే వాళ్ళని ఇదే వెంకయ్య కదూ సాధరంగా ఆహ్వానించింది. ఉదయం పార్టీలోకి ఫిరాయిస్తే సాయంత్రానికల్లా వాళ్ళని బిజెపి సభ్యులుగా గుర్తించినట్లు బులెటిన్ ఎలా రిలీజ్ చేశారు ? లెక్క ప్రకారమైతే వాళ్ళపై అనర్హత వేటు ఎందుకు వేయకుండా రోత, అనైతిక పనులకు ఎందుకు దిగారో వెంకయ్యే సమాధానమివ్వాలి.