దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మూడోసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సివిల్ లైన్స్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. పాండవ్ నగర్ లోని ఎంసీడీ పాఠశాలలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తన తల్లితో కలిసి రతన్ దేవి పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాటియాల నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జస్టిస్ ఆర్ భానుమతి తుగ్లక్ క్రెసెంట్ ప్రాంతంలోని పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ బూత్ లో విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జై శంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ పౌరులంతా ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. శాఖర్పూర్ లోని ఒక పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మరికాసేపట్లో పెళ్లి ఉందనగా ఒక యువకుడు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశాడు. భారీ స్థాయిలో పెళ్లికొడుకు మరియు అతని బంధువులు పోలింగ్ కేంద్రానికి రావడం గమనార్హం. భారీ భద్రత నడుమ పోలింగ్ జరగనుండగా బాబర్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది.
ఉధమ్ సింగ్ అనే ఎన్నికలు నిర్వహిస్తున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. ఎన్నికల అధికారి మరణంతో ఈ పోలింగ్ కేంద్రంలో కొంతసమయం పాటు పోలింగ్ నిలిచిపోయింది. పలు చోట్ల ఈవీఎంల మొరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఈరోజు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఫతేనగర్ గురుద్వారాలో బీజేపీ అభ్యర్థి తాజిందర్ పాల్ సింగ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు.