లక్షలాది మంది నివసించే నగరాలను శుభ్రంగా ఉంచటం కొద్దిమంది సిబ్బందితో అసాధ్యం. ప్రజలందరి సహకారం కూడా అవసరం. దీనికి చిత్తశుద్ధి ఉన్న అధికారులు అంతకంటే అవసరం. అనంతపురం రూపు రేఖలు మారటంలో , సుందర అనంతగా తీర్చిదిద్దటంలో అధికారులు, ప్రజలు సమష్టిగా భాగస్వామ్యం వహిస్తున్నారు.
అనంతపురం జిల్లా కేంద్రం.. కార్పొరేషన్ గా గుర్తింపు పొంది 15ఏళ్లు గడుస్తోంది. కాని ఇప్పటికీ నగరం పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది. కొన్ని రోడ్లు చూస్తే ఇది జిల్లా కేంద్రమేనా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, చెత్తతో నిండిపోయిన డ్రైనేజీలు, గుంతలు పడిన రోడ్లు, అడ్డూ అదుపు లేకుండా గోడలపై అంటించే పోస్టర్లు.. అన్నీ కలిసి అనంతరపురంలో అనంతమైన సమస్యలు కనిపిస్తాయి.
అనంతపురానికి ఎంతోమంది అధికారులు వచ్చారు.. వెళ్లారు.
ఇతర పనుల సంగతేమో కానీ, నగరం రూపురేఖలు, బ్యూటిఫికేషన్, పరిసరాల శుభ్రతపై దృష్టిపెట్టినవారు లేరు. కానీ ఇప్పుడో అధికారి అనంతను అందంగా మార్చాలని దీక్షపట్టారు. జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన గంధం చంద్రుడు నగరంపై దృష్టిపెట్టారు. జిల్లా కేంద్రాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నంలో ఉన్నఆయన, దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను కూడా భాగస్వాములను చేస్తున్నారు.
మన అనంత-సుందర అనంత పేరుతో ఈ కార్యక్రమం గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభమయింది. ఇందులో భాగంగా, నగర రూపురేఖలు మార్చటం కోసం, నాలుగు రకాల కార్యక్రమాలు చేపట్టారు. మొదటిది నగరంలోని రోడ్లన్నీ శుభ్రంగా ఉంచడం. చెత్తా చెదారం పోగుపడకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం. రెండవది బ్యూటిఫికేషన్. సంస్కృతి ఉట్టిపడేలా గోడలకు రంగులు, పలురకాల డిజైన్లతో పెయింటింగ్స్ వేయించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.
మూడవది 65 కోట్లతో అనంతపురం నగరంలోని రోడ్లు, డ్రైనేజీలను శుద్ధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగోది అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు.
ఈ కార్యక్రమాలద్వారా అనంతపురాన్ని స్వచ్ఛంగా మార్చే ప్రయత్నం శరవేగంగా సాగుతోంది. నిత్యం జరుగుతున్న పనులను సమీక్షిస్తూ, ప్రజల సహకారంతో ఉగాది నాటికి అనంతపురం రూపురేఖలు మార్చగలమనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ చంద్రుడు.
అనంతపురం నగరంలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. మూడు లక్షల జనాభా ఉంది. సుమారు 60కి పైగా స్లమ్ లు ఉన్నాయి. ఇప్పుడు వీటిన్నింటి రూపురేఖలు మార్చి.. నగరాన్ని సుందరంగా మార్చేందుకు ఉధృతంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలను విభజించుకుని ఒక్కో వారం ఒక్కో డివిజన్ లో స్వచ్ఛ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి శనివారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ తోపాటు జిల్లా ఉన్నతాధికారులంతా పాల్గొంటున్నారు. మొదటి వారం కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు పాల్గొనగా.. రెండవ వారం ప్రజాప్రతినిధులు కూడా తోడయ్యారు. మూడవ వారం వివిధ వర్గాల వారు స్వచ్ఛంద సంస్థల వారుకూడా కలసి వచ్చారు.
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని.. నగరాన్ని సుందరంగా మార్చేందుకు కలెక్టర్ చేస్తున్న ఈ ప్రయత్నానికి తమ వంతు సహకారం అందిస్తామంటున్నారు.
చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం కచ్చితంగా సత్పలితాన్నిస్తుంది. గంధం చంద్రుడు లాంటి అధికారులు, ప్రజలను, ఇతర సిబ్బందిని, ప్రజాప్రతినిధులను కలుపుకుంటూ చేస్తున్నప్రయత్నాలకు మంచి స్పందన వస్తుంది. ఉగాదినాటికి అనంత సుందరంగా మారుతుందనే నమ్మకం ఇక్కడ అందరిలో బలంగా ఉంది.