వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు... ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణలకోసం 11 జాతీయ ప్రఖ్యాత సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వ్యవసాయ, పశు సంవర్థక శాఖ అధికారులు... పదకొండు జాతీయ సంస్థల ప్రతినిధులు... ఎంఓయూలు చేసుకున్నారు.
వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టపరిచేందుకు.. వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆధునిక వ్యవసాయ వ్యవసాయ పద్ధతులకు మరింత ఊతమిచ్చేలా.. చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ సహా వివిధ సంస్ధలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. పరిపాలనను గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికే ఈ వ్యవసాయ సంబంధిత ఒప్పందాలు చేసుకున్నామని సీఎం జగన్ చెప్పారు. జూన్ నాటికి మొత్తం రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లతో పాటు వెటర్నరీ, ఆక్వా అసిస్టెంట్లు కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉంటారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మేలైన విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు ప్రభుత్వమే అందజేయనుంది.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన అడుగు పడిందని.. మంత్రి కన్నబాబు అన్నారు. దేశంలోనే పేరుగాంచిన సాంకేతిక సంస్థలతో ఎమ్ఓయూలు చేసుకున్నామని.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వీరి సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. జాతీయ సంస్థల సహకారం రాష్ట్రంలో వ్యవసాయానికి చాలా అవసరమన్నారు.
రైతు శిక్షణ ఇక నిరంతర ప్రక్రియలా కొనసాగనుంది. మరో నాలుగు కీలక విభాగాల్లో నాలెడ్జ్ పార్ట్‌నర్స్ తో ఎంఓయూ చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిసింది. ప్రతి పంట కి సంబంధించిన నిపుణులను త్వరలోనే ఈ నెట్‌వర్క్‌లోకి తీసుకురానున్నారు.
మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సంచలనాత్మకమైన నిర్ణయాలతో రైతులకు దగ్గరవుతున్నారు. తన పాదయాత్రలో కళ్లారా చూసిన అన్నదాత సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుల కోసం ఇంతవరకూ ఏ రాష్ట్రప్రభుత్వమూ చేపట్టని కార్యక్రమాలను.. ఏపీ అన్నదాతల కోసం చేస్తున్నారు. రైతుల మన్ననలు పొందుతున్నారు.