ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలుకాబోతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయాలని హీట్ ఎక్కించనున్నాయి. ఇప్పటికే మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక లోకల్ ఫైట్‌ షురూ కావడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటెందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ పాగా వేస్తామో లెక్కలు కూడా వేసుకుంటున్నారు.

 

ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ నగరపాలక సంస్థల(కార్పొరేషన్)పై ఎక్కువ గురి పెట్టింది. 2014 ఎన్నికల ముందు జరిగిన లోకల్ ఫైట్‌లో వైసీపీ కార్పొరేషన్స్‌లో కాస్త వెనుకబడింది. దీంతో ఇప్పుడు అధికారం చేతులో ఉండటంతో, రాష్ట్రంలోని అన్నీ స్థానాల్లో తమ జెండా పాతాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు తెలిసింది.

 

ఈ క్రమంలోనే ఏయే స్థానాల్లో వైసీపీ గెలిచే సత్తా ఉందో అంచనాలు వేసుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాలోనూ మెజారిటీ సీట్లు గెలుచారు కాబట్టి, నగర పాలక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో 16 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిల్లో వైసీపీ ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, తిరుపతి కార్పొరేషన్లని సులువుగా గెలుచుకుంటుందని తెలుస్తోంది.

 

ఇక నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడలని కూడా తమ ఖాతాలో వేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉంది.  అయితే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌ల్లో గెలుపుపై అనుమానం ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు చోట్ల టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు రాజమండ్రిలో టీడీపీతో గట్టి పోటీ ఎదురుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే మెజారిటీ కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: