ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు స్థానంలో త్వరలో ఆర్డినెన్స్ తీసుకొనిరానున్నట్టు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ అసెంబ్లీ, శాసనమండలిలను ప్రోరోగ్ చేస్తూ ఈరోజు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. గవర్నర్ ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో సీఆర్డీఏ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సభలను ప్రోరోగ్ చేయడం ద్వారా ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. 
 
శాసనమండలి సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంతో ప్రభుత్వం శాసన మండలి రద్దు చేస్తూ తీర్మానం చేయడంతో పాటు ఆ బిల్లును కేంద్రానికి పంపింది. సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సమయంలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించాలని కోరినట్లు సమాచారం. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొనివస్తే సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులు పరిగణనలోకి వచ్చినట్టే అని ప్రభుత్వం భావిస్తోంది. 
 
ఆర్డినెన్స్ ద్వారా సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపచేసి కార్యాలయాలను తరలించాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. మరోవైపు హైకోర్టులో ఈ రెండు బిల్లుల గురించి ఈ నెల 25వ తేదీన విచారణ జరుగుతోంది. రాష్ట్రంలో జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదిక తరువాత ప్రభుత్వం శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజదానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయిస్తూ తీర్మానం చేసింది. 
 
ఆ తరువాత తీవ్ర ఉత్కంఠ నడుమ బిల్లులను శాసన మండలికి పంపగా శాసన మండలి ఆ బిల్లులను ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపింది. కాని నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీల ఏర్పాటు కుదరదంటూ దస్త్రాన్ని మండలి కార్యదర్శి తిప్పి పంపారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఉభయ సభలను ప్రోరోగ్ చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: