సీఎం హోదాలో ఉన్నంత మాత్రాన అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడం సరికాదని హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. ఏ నిందితుడికీ హాజరు మినహాయింపు అనేది హక్కు కాదని, హాజరు మినహాయింపు కేవలం న్యాయస్థానం విచక్షణాధికారం మాత్రమేనని పేర్కొంది. సీఎం జగన్ కు హాజరు మినహాయింపునిస్తే ధన, బల, రాజకీయ ప్రయోగాలతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
జగన్ పై తీవ్రమైన ఆర్థిక నేరాలు ఉన్నాయని అందువలన హాజరు మినహాయింపు ఇవ్వడం సరికాదని తెలిపింది. సుప్రీం కోర్టు గతంలో అతిపెద్ద ఆర్థిక నేరాలలో సీఎం జగన్ కేసు కూడా ఒకటని వ్యాఖ్యలు చేసిందని సీబీఐ హైకోర్టుకు గుర్తు చేసింది. జగన్ ముడుపులను పెట్టుబడులుగా పొందడానికి సొంత కంపెనీలను వినియోగించుకున్నారని, 11 అభియోగ పత్రాల్లోనూ ఆర్థిక మోసాల్లో జగన్ ప్రధాన లబ్ధిదారుగా ఉన్నారని సీబీఐ పేర్కొంది.
మొదటి అభియోగ పత్రం దాఖలు చేసి 8 సంవత్సరాలు అయిందని చివరిది దాఖలు చేసి 6 సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు విచారణ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదని పేర్కొంది. భిన్నమైన సెక్షన్లను ఉపయోగించి పిటిషన్లను దాఖలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందుతూ విచారణ ప్రక్రియను కావాలని జాప్యం చేస్తున్నారని సీబీఐ పేర్కొంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కేవలం ఒకసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారని దాదాపు 9 నెలల పాటు సీఆర్‌పీసీ సెక్షన్ 317 కింద హాజరు మినహాయింపు పొందారని సీబీఐ పేర్కొంది.
సీబీఐ తన కౌంటర్ లో సీఆర్‌పీసీ సెక్షన్ 273 ప్రకారం నిందితుడి సమక్షంలో మాత్రమే నేర విచారణ జరగాలని పేర్కొంది. 2014, 2016 సంవత్సరాలలో జగన్ దాఖలు చేసిన మినహాయింపు పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసిందని వీటిపై దాఖలు చేసిన అప్పీళ్లను కూడా 2017 సంవత్సరం ఆగష్టు 31వ తేదీన హైకోర్టు కొట్టివేసిందని సీఎంగా హోదా మారిన తరువాత జగన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసిందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ఏప్రిల్ నెల 9వ తేదీన పిటిషన్ల గురించి తుది విచారణ చేపట్టనుంది.