తెలంగాణ రాష్ట్రంలో వరుస కాల్పుల ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఐదురోజుల క్రితం ఉమ్మడి కరీంనగర్ లోని సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో సదానందం అనే వ్యక్తి గంగరాజు అనే మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. సదానందం పోలీసులు ఉపయోగించే ఏకె 47తో కాల్పులు జరపటంతో అక్కన్నపేట గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మరవకముందే తాజాగా మరోసారి తెలంగాణలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాల్పుల మోత మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని శాయంపేటలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి తిరుమల్ రెడ్డి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపిన తిరుమల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పూర్తి వివరాలలోకి వెళితే ఆర్మీ నుండి రిటైర్ అయిన తిరుమల రెడ్డి పెళ్లి బారాత్ వేడుకల్లో నిన్న రాత్రి కాల్పులు జరిపాడు. నిన్న అర్ధరాత్రి సమయంలో తిరుమల్ రెడ్డి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తిరుమల్ రెడ్డి చేష్టలకు బారాత్ వేడుకలో పాల్గొన్నవారు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తిరుమల్ రెడ్డి కాల్పులు జరిపిన గన్ కు లైసెన్స్ ఉందా...? లేదా..? బారాత్ లో తిరుమల్ రెడ్డి ఎందుకు కాల్పులు జరిపాడని పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
పోలీసులు లైసెన్స్ లేని గన్ తో కాల్పులు జరిపి ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం కూడా తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. పోలీసులు బుల్లెట్లను, తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. స్థానికులు ప్రతి చిన్న విషయానికి తిరుమల్ రెడ్డి తుపాకీని చూపించి భయాందోళనకు గురి చేస్తున్నాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.