తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు పడగ విప్పాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. సహకార ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లాలో పాత కక్షలకు టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న బలయ్యారు. సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకన్న పార్టీ కార్యకర్తలతో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రత్యర్థులు గొడ్డళ్లు, కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా వెంకన్నను హత్య చేశారు. ప్రత్యర్థులు వెంబండించడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెంకన్న ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కున్నా ప్రత్యర్థులు మాత్రం గొడ్డళ్లతో నరికి వెంకన్నను చంపేశారు. టీఆర్ఎస్ పార్టీ నేత మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంకన్నను కాంగ్రెస్ పార్టీ నేతలే హత్య చేసి ఉండవచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా యార్కారం గ్రామంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నేతల మద్య చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. హత్య గురించి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ నాగేశ్వరరావు వెంకన్న మృతదేహాన్ని పరిశీలించి గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
పోలీసులు టీఆర్ఎస్ పార్టీ నేత హత్య గురించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు గ్రామంలోనే ఉంటూ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇదే గ్రామంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ నాయకుడు, గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ ను హత్య చేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఆస్పత్రికి తరలిస్తున్నారు. హత్యకు దారి తీసిన కారణాల కోసం పోలీసులు గ్రామస్థులను విచారిస్తున్నారు.