రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దారణంగా ఉంది. పలు జిల్లాల్లో అయితే, పార్టీ జెండా మోసే నాయకులు కూడా లేకుం డా పోయారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఇరుకున పడుతున్న విషయం తెలిసిందే. అన్నీ నేనే చూసుకో వాలం టే ఎలా? అంటూ.. ఆయన అనేక పర్యాయాలు బాబు పార్టీ సీనియర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా చంద్రబాబు ఇదే విధంగా పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినా కూడా ఎవరూ పార్టీ విధి విధానాలు అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఏదో మీడియా ముందుకు రావడం కరెంట్ ఎఫైర్స్‌పై నాలుగు కామెంట్లు చేయడంతోనే వారు సరిపెడుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి ఏంటనేది నిజంగానే చర్చకు దారితీస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలైన గుంటూరు, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు వంటి చోట్ల కూడా పార్టీ తరఫున పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదని పార్టీ అధిష్టానం గుర్తించింది.
అయితే, వీటిలో అనంతపురం మరింత ప్రత్యేకంగా మారింది. ఇక్కడ గతంలో భారీ ఎత్తున టీడీపీ తన హవా చాటింది. పార్టీ జెండాతో పాటు నాయకుల అజెండా కూడా ఇక్కడ కీలకం. అనేక మంది నాయకులు ఇక్కడ ముందుండి పార్టీని నడిపించారు. జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్, పరిటాల వర్గం, సూరి వర్గం, శమంతకమణి కుటుంబం, ప్రభాకర్ చౌదరి వర్గం ఇలా చాలా మంది నాయకులు పార్టీని ముందుండి నడిపించారు. కానీ, ఇప్పుడు పార్టీ ఓటమి తర్వాత పెద్దగా వీరు చురుగ్గా కనిపించడం లేదు.
ప్రభాకర్ చౌదరి అప్పుడప్పుడు మెరుస్తున్నా.. లోలోన అసంతృప్తితో రగులుతున్నాడు. ఇక, జేసీ బ్రదర్స్ పరిస్థితి ఒక కాలు ఇక్కడ, ఇంకో కాలు మరో చోట అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. పయ్యావుల కేశవ్.. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఉన్నా.. పేరుకే ఆయన అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లా మొత్తంగా ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. బాబు చేపడుతున్న కార్యక్రమాలకు సంఘీభావం తెలపడం లేదు. కానీ, వీరిలో ప్రత్యేకంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాత్రం దూకుడు చూపిస్తున్నారు.
ఇప్పటికి ఆయన చంద్రబాబు పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యారు. పోలీసులతో కేసులు కూడా నమోదయ్యాయి. పార్టీ ఇచ్చే ప్రతిపిలుపును ఆయన విజయం సాధించేలా ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడ విన్నా.. కాల్వ మాటే వినిపిస్తోంది. అయితే, సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ.. ఈయన ఒక్కడే ముందుకు రావడంపై ఒకింత విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కాల్వకు సహకరించాల్సిన అవసరం ఉందని సీనియర్లు గుర్తించాలని కోరుతున్నారు కార్యకర్తలు.