పొత్తు పెట్టుకున్నా సరే బీజేపీ తన మాట వినడం లేదనే బాధ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఎక్కువగా కనిపిస్తోంది. పొత్తు పెట్టుకున్న మొదట్లో రాజధాని అమరావతి లో ఉండేలా బీజేపీకి షరతులు విధించి మరీ తాను పొత్తు పెట్టుకున్నా అంటూ పవన్ చెప్పారు. అయితే జగన్ బీజేపీ అగ్ర నాయకులను కలిసిన తరువాత వారు కూడా జగన్ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడ్డం, అసలు రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అంటూ చెప్పడంతో పవన్ కూడా మాట మారుస్తూ రాజధాని అంశం రాష్ట్రం పరిధి లోనిది అంటూ కొత్తగా మాట్లాడారు. నేను రోడ్డు మీదకి వస్తే రాజధాని తరలింపు నిర్ణయం ఆగిపోతుంది అనుకుంటే మాట ఇస్తా, కానీ నా చేతిలో లేనప్పుడు ఎలా మాట ఇవ్వగలను అంటూ రైతులను పవన్ ప్రశ్నించారు.
ఈ రోజు అమరావతి పరిసర గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాల్లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి పరిసర ప్రాంత ప్రజలు టిడిపి కోసం వారి భూములు ఇవ్వలేదని, రాజధాని నిర్మాణం కోసమే భూములు ఇచ్చారని, ఇప్పుడు వాటిని కాదని ఎక్కడో మూడు రాజధానులు పెడతామని జగన్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ఇదే విషయం ఎన్నికలకు ముందే జగన్ చెబితే పరిస్థితులు వేరేగా ఉండేది అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా తీసుకువచ్చిన ఆధార్ కార్డులను ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తోందని, అదేవిధంగా అమరావతిని కూడా వైసీపీ ప్రభుత్వం కొనసాగించాలంటూ కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. దీంతో పవన్ బోడిగుండుకు, మోకాలికి లింకు పెడుతున్నారంటూ పలువురు ఆసక్తిగా కామెంట్స్ చేశారు. టీడీపీ తో గొడవ ఉంటే వారిని ఏమైనా చేసుకోండి.. కానీ ఒక చిన్న పెన్నుతో రాజధాని మారుస్తాం అంటే కుదరదు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అహంకారం నెత్తికెక్కి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవద్దని వైసీపీ ప్రభుత్వం ఉద్దేశించి పవన్ కామెంట్స్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రకటనలు చేసేందుకు పరిమితమైన అధికారాలు ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడవచ్చు కానీ ఆదేశించలేదు అంటూ పవన్ చెప్పడం రైతులను కూడా అయోమయానికి గురి చేసింది. గతంలో తాను అమరావతి విషయంలో ముందుండి పోరాడుతాను అంటూ చెప్పిన పవన్ ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీ అగ్రనేతల తీరు చూసిన తర్వాత పవన్ కూడా తన రూటు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మతాల ద్వారా తాను నిస్సహాయుడునని, తన చేతుల్లో ఏమీ లేదు అనే విషయాన్ని పవన్ ఇలా ప్రకటించుకున్నారు.