చైనాలో కరోనా వైరస్ పంజా కొనసాగుతోంది. కోవిడ్ 19 ధాటికి మరో 143 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ దీని భారిన పడి చనిపోయినవారి సంఖ్య 1600 దాటింది. అయితే అనుమానితుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఊపిరి పీల్చుకుంటోంది. మరోవైపు భారత్‌లో వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. జపాన్ నౌకలో చిక్కుకున్న ఇండియన్స్‌ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చైనాలోని హుబే ప్రావిన్స్‌లో కోవిడ్ 19 వైరస్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతోంది. రోజుకు వంద మందికి పైగా ఇక్కడ చనిపోతున్నారు. హుబే రాష్ట్రంలో కొత్తగా 2వేల 420 మందికి కొత్తగా వైరస్ సోకడంతో చైనా బెంబేలెత్తిపోతోంది. దీంతో ఇప్పటి వరకు మహమ్మారితో బాధపడుతున్న వారి సంఖ్య 66వేల 500లకు చేరుకుంది. మరోవైపు చైనా వెలుపల బాధితుల సంఖ్య 600కి చేరింది.
అయితే హబే రాష్ట్రంలో మినహా మిగిలిన చోట్ల బాధితుల సంఖ్య తగ్గుతున్నట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. వైరస్‌ని కట్టడి చేయడానికి అత్యాధునిక బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతను వినియోగించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. వుహాన్ ఆసుపత్రుల్లో వైరస్ బాధితులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం కోసం రోబోలను రంగంలోకి దించారు.
చైనా సహా విదేశాల నుంచి వచ్చిన సుమారు 80 మందిని ఒడిషా ఇళ్లకే పరిమితం చేసింది. వైద్యుల పర్యవేక్షణలో వారిని అబ్జర్వేషన్‌లో ఉంచింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభు్తవం వెల్డించింది. మరోవైపు.. జపాన్ విహార నౌక 'డైమండ్ ప్రిన్సెస్'లో ఉన్న భారతీయుల్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. వైద్య పర్యవేక్షణ ముగిసిన వెంటనే వారందర్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జపాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు సహా నౌకలో 218 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వైరస్ బారిన పడ్డ ముగ్గురు భారతీయుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.
కొవిడ్-19 వైరస్ ప్రభావం వేలంటైన్స్‌డై పైన కూడా కనిపించింది. హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మాస్కులు ధరించిన ప్రేమికులు అక్కడక్కడ వీధుల్లో కనిపించారు.