వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రభుత్వంలోని తప్పులన్నీ చక్కదిద్దుతున్నామంటోంది. అందులో భాగంగానే రేషన్ కార్డుల ప్రక్షాళన ప్రారంభించింది. కొన్ని రోజులుగా తమ రేషన్ కార్డు తీసేశారన్న ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. టీడీపీ అనుకూల పత్రికలు వీటిని హైలెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
ఇక నుంచి బియ్యం రేషన్ కార్డు కోసం ఏడాదిలో 365 రోజులూ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కొడాలి నాని చెప్పారు. అంతే కాదు.. దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో అర్హత ఉంటే కార్డు మంజూరు చేసేస్తారట. అర్హులైన ప్రతి కుటుంబానికి బియ్యం కార్డులు అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హత పరిశీలించి ఐదు రోజుల్లో మంజూరు చేస్తామని వివరించారు.
విజయవాడలోని జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నూతన బియ్యం కార్డులను లబ్ధిదారులకు మంత్రి కొడాలి నాని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పరిశీలన అనంతరం 1.29 కోట్ల మందిని బియ్యం కార్డులకు అర్హులుగా గుర్తించామన్నారు. దాదాపు 2 లక్షల కార్డులకు సరైన అడ్రస్‌లు లేవని తెలిపారు. మరో 6 లక్షల మంది తమకు అర్హత ఉన్నా కార్డులను తొలగించారని దరఖాస్తు చేస్తున్నారని వివరించారు.
వీటన్నింటినీ.. ఈ నెలాఖరు లోగా అర్హులను పరిశీలించి ఇస్తామన్నారు. మరో 8 లక్షలు మంది ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉంటే చాలని రేషన్ కార్డులను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారన్నారు. బియ్యం కార్డుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో 365 రోజులు దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి సూచించారు. బియ్యం కార్డులకు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధం లేదని, రాష్ట్రంలో 10లక్షల కుటుంబాలు మినహా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.