తెలంగాణ రాష్ట్రంలో బోయపల్లి అనే చిన్న గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ బోయపల్లి గ్రామానికి రాష్ట్రంలో ఇతర గ్రామాలతో పోలిస్తే మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 48 మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. గ్రామంలో ఎవరూ ప్రముఖ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకోకుండానే వేల రూపాయలు ఖర్చు చేయకుండానే సర్కారీ కొలువులు సాధించారు. 
 
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బోయపల్లి ఈ అరుదైన ఘనతను సాధించింది. ఈ గ్రామంలో నిరుద్యోగుల సంఖ్య పది మందికి అటూ ఇటుగా ఉందంటే బోయపల్లి గ్రామం గొప్పతనం సులభంగా అర్థమవుతుంది. బోయపల్లి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను కూడా ఈ గ్రామంలో యువత కష్టపడి ఉద్యోగాలను సాధిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తూ ఆలోచింపజేస్తోంది. బోయపల్లి గ్రామంలోని యువత ఒక పాత ఇంట్లో ఉద్యోగ సాధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలు సాధిస్తున్నారు. 
 
ఏవైనా పోటీ పరీక్షలు జరిగి ఫలితాలు విడుదలయితే బోయపల్లి గ్రామం నుండి కొందరైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఉంటారు. గ్రామంలోని నిరుద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంలో నలుగురు యువకుల కృషి ఉంది. రాజేశం, భాస్కర్, మల్లేష్, సిరికొండ సంతోష్ కొన్ని నెలల క్రితం అటవీ శాఖ ఉద్యోగాల కొరకు గ్రామంలోని ఒక ఖాళీ ఇంటిని అద్దెకు తీసుకొని సాధన మొదలుపెట్టారు. 
 
పరీక్షలలో విజయం సాధించడానికి అవసరమైన మెటీరియల్ ను సొంతంగా సిద్ధం చేసుకున్నారు. నలుగురు యువకులకు ఉద్యోగాలు రావడంతో ఆ తరువాత ఆ ఇంట్లో చదివి ఇప్పటివరకు 48 మంది ఉద్యోగాలను సాధించారు. ప్రతి సంవత్సరం బోయపల్లి గ్రామంలోని ఆ ఇంట్లో చదివి ఉద్యోగాలు సాధించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏ ప్రభుత్వ పరీక్ష ఫలితాలు విడుదలయినా బోయపల్లి నుండి ఎంతమంది ఎంపికయ్యారు...? అనేంత ప్రత్యేకతను ఈ గ్రామానికి ఇక్కడి యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తీసుకొనిరావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: