జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని రేపల్లెలో మాట్లాడుతూ తనను ఎంతమంది ఎన్ని తిట్టినా ఆశీర్వచనంగానే భావిస్తానని అన్నారు. తాను ఓటమికి కుంగిపోయే వ్యక్తిని కానని రాజకీయాల్లో ఓటమి అనేది సహజమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుత సమాజం స్వార్థంతో పక్కదారి పడుతోందని యువశక్తిని ఉచితం పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని పవన్ అన్నారు. 
 
ప్రజల సమస్యల పరిష్కారం కొరకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు. పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి రావడం కొందరికే సాధ్యమవుతుందని అది అందరికీ సాధ్యం కాదని అన్నారు. జనసేన పార్టీని దూర దృష్టితో తాను స్థాపించానని అన్నీ ఆలోచించే జనసేన పార్టీని స్థాపించానని అన్నారు. రాజకీయం అంటే డబ్బు సంపాదన మాత్రమే కాదని పవన్ చెప్పుకొచ్చారు. 
 
పార్టీ పెట్టగానే అధికారంలోకి రావడం సీనియర్ ఎన్టీయార్ కు మాత్రమే సాధ్యమైందని ఆనాటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీయార్ కు మాత్రమే అలా జరిగిందని పవన్ అన్నారు . రాజకీయ పార్టీల నేతల తీరు రాజకీయాలలో అందినకాడికి సంపాదించి కొంత ప్రజలకు పెట్టేలా ఉందని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి పవన్ విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చెందలేదని పవన్ చెప్పారు. 
 
జనసేన పార్టీపై ఇష్టంతో, జనసేన పార్టీపై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే జనసేన పార్టీకి ఓట్లు వేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే స్థానంలో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలయినప్పటికీ పవన్ మాత్రం తన దృష్టిలో జనసేన పార్టీ ఓటమి చెందలేదని చెబుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: