ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టికల్ 370 రద్దు, సీఏఏలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఈరోజు తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. మోదీ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు విషయంలో పునరాలోచన చేయబోమని అన్నారు. ఈ రెండు నిర్ణయాలను దేశ ప్రయోజనాల కోసం తీసుకున్నానని ఈ నిర్ణయాల విషయంలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పారు. 
 
ఈ రెండు నిర్ణయాల విషయంలో తమపై ఒత్తిడి వస్తోందని అయినప్పటికీ తీసుకున్న నిర్ణయాలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటామని మోదీ అన్నారు. భారతదేశం ఈ నిర్ణయాల కొరకు చాలా సంవత్సరాలపాటు ఎదురు చూసిందని చెప్పారు. ఈ నిర్ణయాల విషయంలో అన్ని వైపుల నుండి ఒత్తిడి వస్తుందని అయినప్పటికీ ఈ నిర్ణయాల విషయంలో ధృడ నిశ్చయంతో ఉన్నామని మోదీ అన్నారు. 
 
ఈ నిర్ణయాలను జాతి ప్రయోజనాల కోణంలో చూస్తే తప్పనిసరిగా అమలు చేయాలని మోదీ చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ 1254 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50 ప్రాజెక్టులకు ఈరోజు శంఖుస్థాపన చేశారు. మహా కాళా ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ వీడియో లింక్ ను ఉపయోగించి ప్రారంభించారు. 
 
మూడు జ్యోతిర్లింగాలైన ఓంకారేశ్వర్, ఉజ్జయిని, వారణాసిలను ఈ ప్రైవేట్ రైలు కలపనుంది. మోదీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 63 అడుగుల ఎత్తయిన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాశీ ఒకటి రూపాలు అనేకం అనే ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ఈ ప్రదర్శన గురించి మోదీ మాట్లాడుతూ ప్రతి ప్రాంతానికి ప్రతి జిల్లాకు ప్రత్యేక ఉత్పత్తి, ప్రత్యేక కళ ఉండటం దేశ ఔన్నత్యానికి నిదర్శనమని చెప్పారు. శతాబ్దాలుగా ఇది మన సాంప్రదాయమని మోదీ చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: