కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కాకతీయ కెనాల్ లో కొన్ని రోజుల క్రితం పడిన కారును పోలీసులు ట్రేస్ చేశారు. కాలువలో పడి మునిగిపోయిన కొంత దూరంలోనే కారు లభ్యమైంది. కారులో ఉన్న ఇద్దరు చనిపోగా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. అధికారులు కాకతీయలో నీటి ప్రవాహాన్ని నిలిపివేయటంతో యాదాలపల్లి దగ్గర కారు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు దాదాపు 15 రోజుల క్రితం కారు కాలువలో పడి ఉండవచ్చని భావిస్తున్నారు. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారులోని మృతదేహాలలో ఒక మృతదేహం కరీంనగర్ జిల్లాకు చెందిన బ్యాంక్ ఉద్యోగి నారెడ్డిసత్యనారాయణదిగా పోలీసులు గుర్తించారు. కాలువలో కారు ఎప్పుడు పడిందన్న విషయం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు నిన్న రాత్రి ఒక బైక్ అదుపుతప్పి కాకతీయ కాల్వలోకి వెళ్లడంతో దంపతులు నీటిలో కొట్టుకుపోయారు. 
 
ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్త ప్రాణలతో బయటపడ్డాడు. ఒక శుభకార్యం నిమిత్తం కరీంనగర్ కు వెళ్లిన దంపతులు ప్రదీప్, కీర్తన తిరుగు ప్రయాణంలో బైక్ పై బయలుదేరగా ప్రదీప్ కంట్లో పురుగులు పడటంతో బైక్ అదుపుతప్పి బైక్ తో సహా దంపతులు కాకతీయ కాల్వలో పడ్డారు. భార్య మృతి చెందడంతో ప్రదీప్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మరో ప్రమాదం కూడా చోటు చేసుకుంది. 
 
మానేరు వంతెనపై వెళుతున్న కారును లారీ ఢీ కొనడంతో వంతెనపై నుండి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సాయం చేయాలని ఒక కానిస్టేబుల్ ప్రయత్నించగా వంతెనపై నుండి జారి పడటంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. వరుస ప్రమాదాలకు సంబంధించిన వార్తలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: