ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్ భేటీ అయ్యారు. గవర్నర్ తో కీలక అంశాలపై ఈరోజు రాత్రి 7 గంటల సమయంలో షరీఫ్ రాజ్ భవన్ కు చేరుకుని చర్చించారు. గవర్నర్ కు షరీఫ్ సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు కమిటీకి పంపించే విషయం గురించి ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడారు.
మండలి కార్యదర్శి సంబంధిత ఛైర్మన్ సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినా ఫైలును వెనక్కు పంపించారని షరీఫ్ అన్నారు. తాను శాసన మండలి ఛైర్మన్ నని తాను ఆదేశాలు జారీ చేసినా కూడా సెలక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో తన ఆదేశాలను లెక్క చేయలేదని అన్నారు. గవర్నర్ కు మండలిలో జరిగిన పరిణామాల గురించి తాను పూర్తిగా వివరించానని అన్నారు.
గవర్నర్ ను శాసన మండలి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయలేదని అన్నారు. గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. మండలి కార్యదర్శి ఛైర్మన్ గా తానిచ్చిన రూలింగ్ ను పూర్తిగా బేఖాతరు చేస్తున్నారని అన్నారు.
సెలక్ట్ కమిటీని కేవలం తనకున్న విచక్షణాధికారంతోనే ఏర్పాటు చేశానని అన్నారు. ఇప్పటివరకు ఛైర్మన్ నిర్ణయాన్ని మండలి చరిత్రలో ఎవరూ వ్యతిరేకించిన దాఖలాలు లేవని అన్నారు. కానీ మండలి కార్యదర్శి తన నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నారు. లేఖ రూపంలో గవర్నర్ కు సెలక్ట్ కమిటీ ఏర్పాటు విషయం గురించి షరీఫ్ వివరించారు.