ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. మార్క్ ఫెడ్ కు ఈ కర్షక్ నమోదు లేకపోయినా శనగలను, కందులను రైతుల నుండి కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో 100 శనగల కేంద్రాలను, 98 కందుల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కర్షక్ లో నమోదు అయితే మాత్రమే గతంలో ఈ పంటలు కొనుగోలు చేసేవారని ప్రస్తుతం నమోదు కాకపోయినా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఈ కర్షక్ లేకపోయినా రైతుల నుండి కొనుగోలు చేయాలంటే మాత్రం వ్యవసాయ అధికారుల నుండి రైతులు లెటర్ ను తీసుకొనిరావాల్సి ఉంటుందని కన్నబాబు చెప్పారు. 5,79,329 క్వింటాళ్ల శనగలు, 1,95,000 క్వింటాళ్ల కందులు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామని కన్నబాబు చెప్పారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించటానికి ఏర్పాట్లు చేస్తోందని కన్నబాబు తెలిపారు.
ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా రైతు భరోసా కేంద్రాలు మారనున్నాయని కన్నబాబు చెప్పారు. సీఎం జగన్ ఆలోచనల నుండి రైతు భరోసా వ్యవస్థ పుట్టిందని, రైతు భరోసా గురించి ఇతర రాష్ట్రాలు కూడా ఆరా తీసున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో వచ్చే ఖరీఫ్ నాటికి రైతు భరోసా కేంద్రాలు వస్తాయని చెప్పారు. రెండో దశలో ఏజెన్సీ ప్రాంతాలలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయన్నునామని తెలిపారు.
ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖల మధ్య సమన్వయం, అనుసంధానం ఉండాలని నిర్ణయం తీసుకుందని కన్నబాబు చెప్పారు. ప్రభుత్వం ఇందుకోసం జిల్లా కలెక్టర్ ను ఛైర్మన్ గా, వ్యవసాయ శాఖ జేడీ కన్వీనర్ గా, అన్ని శాఖల అధికారులు ఒక కమిటీగా నియమించామని చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీల వలన రైతులకు నాణ్యమైన సేవలు అందుతాయని తాము భావిస్తున్నామని చెప్పారు.