సాధారణంగా ఎక్కడైనా హిందూ మతానికి సంబంధించిన మఠాలకు హిందువులే పూజారులుగా ఉంటారు. కానీ మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం ముస్లిం యువకుడు హిందూ మతానికి సంబంధించిన మఠానికి పూజారిగా ఎంపికయ్యాడు. హిందూ మఠానికి ముస్లిం యువకుడు పూజారి కావడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. కర్ణాటకలోని మురుగ రాజేంద్ర లింగాయత్ మఠం పూజారిగా ముస్లిం యువకుడు దివాన్ షరీఫ్ ముల్లాను మఠం అధికారులు ఎంచుకున్నారు. 
 
దివాన్ షరీఫ్ ముల్లా చాలా సంవత్సరాల నుండి లింగాయత్ మఠానికి ప్రతిరోజు రావడంతో పాటు మఠానికి పరమ భక్తులుగా కొనసాగేవారు. సరిగ్గా ఏడాది క్రితం మఠం కోసం స్థలం అవసరం కాగా షరీఫ్ రెండెకరాల స్థలాన్ని మఠం అధికారులకు విరాళంగా ఇచ్చారు. షరీఫ్ భక్తిని, గొప్ప మనస్సును చూసి మఠం అధికారులు షరీఫ్ ముల్లాకు మఠం ప్రధాన పూజారిగా బాధ్యతలను అప్పగించారు. 
 
మఠం అధికారులు షరీఫ్ ముల్లాకు యజ్ఞోపవీతంను వేసి ఇష్టలింగంతో పాటు బాధ్యతలను కూడా అప్పగించారు.మఠ ప్రధాన పూజారిగా తనకు బాధ్యతలు అప్పగించడంపై షరీఫ్ ముల్లా స్పందిస్తూ తాను ప్రేమను, త్యాగాన్ని ప్రచారం చేస్తానని మెడలో ఇష్ట లింగాన్ని వేసుకోవడానికి తాను ఇష్టపడుతున్నానని తాను ధర్మం ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. 
 
కొందరు మఠానికి చెందిన స్వామీజీని ముస్లిం యువకుడిని హిందూ మఠానికి మఠ ప్రధాన పూజారిగా బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. స్వామీజీ ఆ ప్రశ్నకు బదులిస్తూ మంచి మార్గంతో పాటు త్యాగ మార్గంలో దేవుడు నడిపిస్తే మనిషి సృష్టించిన మతాలకు, కులాలకు ఎటువంటి సంబంధం ఉండదని చెప్పారు. ఈ లక్షణాలు ఉంటే మఠ ప్రధాన పూజారిగా నియమించే వ్యక్తి ఏ మతానికి చెందిన వాడనే దానితో ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. హిందూ మతానికి పూజారిగా ముస్లిం యువకుడిని నియమించడం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: