కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి. పార్టీ నాయకత్వంపై ఎటూ తేల్చకపోవడంతో కేడర్ మొత్తం డీలా పడిపోతోంది. ఎన్నికల్లో వరుస ఓటములు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నడిపించే నాయకుడి కోసం పార్టీ ఎదురుచూస్తోంది. వెంటనే లీడర్‌ను ఎన్నుకోవాలంటూ పలువురు నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.

 

ఢిల్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి సరైన నాయకత్వం లేకపోవడమేనని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే  వీలైనంత త్వరగా పార్టీ ప్రెసిడెంట్‌ను ఎంచుకోవాలనే డిమాండ్ పార్టీ నేతల నుంచే వస్తోంది.

 

పార్టీ అధినేతను ఎంచుకోవడంలో కాంగ్రెస్ లీడర్లు ఫెయిలవుతున్నారంటూ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ చేసిన కామెంట్లు మర్చిపోకముందే ఎంపీ శశిథరూర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. వెంటనే అధినేత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని డిమాండ్ చేశారు. సందీప్ దీక్షిత్‌ లాగే దేశవ్యాప్తంగా డజన్లకొద్దీ లీడర్లు ఇదే కోరుకుంటున్నారని శశిథరూర్‌ ట్వీట్ చేశారు. వెంటనే నాయకత్వ ఎంపిక ప్రక్రియను చేపట్టాలని సీడబ్ల్యూసీని కోరారు.

 

అయితే సందీప్ దీక్షిత్ కామెంట్లపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌కోసం సందీప్‌ కేటాయించే సమయంలో కొంతయినా ఢిల్లీకోసం కేటాయించి ఉంటే ఫలితం ఉండేదని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. ఉపన్యాసాలివ్వడం మాని మంచి పనిపై దృష్టి పెట్టాలని సూచించారు.

 

ఢిల్లీలో పార్టీ ఓటమి తర్వాత నాయకుల స్వరం పెరిగింది. షీలా దీక్షిత్ వల్లే ఢిల్లీలో పార్టీకి ఈ గతి పట్టిందంటూ పి.సి.చాకో కామెంట్ చేశారు. ఇప్పుడు షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. పార్టీలో కొంతమంది సమర్థులున్నారని, వారంతా తమ మేధోతత్వాన్ని నాయకత్వ ఎన్నికకోసం దృష్టి పెట్టాలని సూచించారు.

 

గతవారం జైరాం రమేష్, జ్యోతిరాదిత్య సింధియా, మనీష్‌ తివారీ లాంటి నేతలు కూడా పార్టీ తీరును తప్పుబట్టారు. అంతర్మథనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: