438 గదులు,4వేల 600 చదరపు గజాల ప్రెసిడెన్షియల్ సూట్,
అధునాతన సౌకర్యాలు.. అడుగడుగునా నిఘా... ట్రంప్ టీమ్ కోసం వందలాది ప్రత్యేక వంటకాలు.. హోటల్ మౌర్య ఐటీసీ ఢిల్లీలో ట్రంప్ కు ఆతిథ్యమివ్వటానికి రెడీ అవుతోంది.
ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో ట్రంప్ ఫ్యామిలీ కోసం గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ హోటల్ పూర్తిగా భద్రతాధికారుల పర్యవేక్షణలోకి వెళ్లిపోయింది. కొద్ది వారాలనుంచి హోటల్ పరిసరాల్లో తనిఖీలు, నిఘాలూ కొనసాగుతున్నాయి.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బుష్ కూడా ఇదే హోటల్ లో ఇదే సూట్ లో ఉన్నారు. హోటల్ మౌర్యను రెండు వారాలుగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులతో పాటు, NSG కమాండోలు, ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతీ ఫ్లోర్ ను రోజూ సర్వే చేస్తున్నారు.
ఈ సూట్ కి ప్రత్యేకమైన ఎంట్రన్స్, హైస్పీడ్ లిఫ్ట్, కిటికీలు తలుపులు బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో ఉంటాయి. ఇందులో రెండు భారీ బెడ్ రూమ్ లతో పాటు, పెద్ద లివింగ్ రూమ్ ఉంటుంది. 12మందికి సరిపడ ప్రైవేట్ డైనింగ్ రూం, చిన్న స్పా, జిమ్ లాంటి సదుపాయాలుంటాయి. ఈ ఫైవ్ స్టార్ హోటల్లో 438 గదులు ఉన్నాయి. ఎప్పుడూ వేర్వేరు దేశాల ప్రతినిధులు, సెలబ్రిటీలు, గెస్టులతో బిజీగా ఉంటుంది. ట్రంప్ ఫ్యామిలీతో సహా వస్తుండటంతో... హోటల్లోని 438 గదులనూ వారికోసం, వారితో వచ్చే అతిథుల కోసం బుక్ చేశారు.
హోటల్ దగ్గర సెక్యూరిటీ ప్రోటోకాల్ అమల్లో ఉంది. కాబట్టి... రాకపోకలు ఆగిపోయాయి. అమెరికా అధ్యక్షుడంటే ఎన్నో టెర్రరిస్ట్ గ్రూపులకు టార్గెట్ గా ఉంటాడు. దీంతో, ట్రంప్ ఇండియా పర్యటనలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ట్రంప్ వచ్చినప్పుడు... హోటల్లోని ప్రతీ ఫ్లోర్లోనూ పకడ్బందీ సెక్యూరిటీ ఉంటుంది. ఢిల్లీ పోలీసులు చివరి అంచెలో రెగ్యులర్ ఖాకీ డ్రెస్సుల్లో కాకుండా... ప్లెయిన్ డ్రస్‌లో కనిపిస్తారు. ట్రంప్ కి సమీపంలో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది, ఎన్ ఎస్జీ, ఎస్పీజీ సిబ్బంది అంచెలుగా ఉంటారు.
హోటల్ ఎదురుగా గ్రీన్ రిడ్జ్ ఏరియా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఐటీసీ మౌర్య హోటల్ పక్కన తాజ్ ప్యాలెస్ హోటల్ ఉంది. దానికి కూడా హైసెక్యూరిటీ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎవరు ఎక్కడ నిఘా పెట్టాలనే అంశంలో ఆఖరికి అత్యున్న పోలీసు అధికారులకు కూడా ముందస్తు సమాచారం ఉండదు. సరిగ్గా ట్రంప్ వచ్చే టైమ్ లో మాత్రమే ఆ వివరాలు తెలియజేస్తారు.