అమరావతి పరిరక్షణ పేరుతో రాష్ట్రంలో ’పెప్పర్ గ్యాంగ్’ తిరుగుతున్నట్లు వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతి కోసం చంద్రబాబునాయుడు నీచమైన రాజకీయాలకు దిగజారిపోయినట్లు ఎంపి మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని తరలించ వద్దని తాను పిలుపినిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమైపోతుందని చంద్రబాబు ఊహించుకున్నాడట. తన పిలుపును ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో కారం చల్లే పెప్పర్ గ్యాంగ్ ను వీధుల్లోకి వదిలినట్లు విజయసాయి అభిప్రాయపడ్డారు. పెప్పర్ గ్యాంగ్ సభ్యులంతా టిడిపి పెయిడ్ ఆర్టిస్టులే అంటూ ఎంపి మండిపడ్డారు. ఇంకెన్ని గ్యాంగులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ?
విజయసాయి అన్నాడని కాదుకానీ క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులే ఎక్కువగా ఉన్నట్లు అందరికీ అనుమానాలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు కొన్ని నిరసనలు, దీక్షలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆందోళన కార్యక్రమాలకు అనుకున్నంతగా జనాలు రాకపోయేసరికి చివరకు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారన్నది వాస్తవం.
అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నాడు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకున్నాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలాడు. వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే.
— Vijayasai reddy v (@VSReddy_MP) February 25, 2020
ఆమధ్య భారీ వర్షాలు, తుపాను ప్రభావం వచ్చినపుడు జగన్ ను తిడుతు మాట్లాడిన రైతుల ముసుగుల్లోని వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులే అని వీడియోల సాక్ష్యంగా బయటపడింది. ఇసుక దీక్షలో కూర్చున్న వాళ్ళల్లో, జగన్ ను శాపనార్ధాలు పెడుతూ మాట్లాడిన వాళ్ళల్లో అత్యధికులు పెయిడ్ ఆర్టిస్టులే అన్న విషయం రుజువైంది. అంటే చంద్రబాబు చేస్తున్న ఆందోళనల్లో టిడిపి నేతలే పెద్దగా కనబడటం లేదు. ఇపుడు అమరావతి పరిరక్షణ పేరుతో చేస్తున్న ఆందోళనల్లో కూడా ఎక్కువభాగం ఇదే పరిస్ధితి.
లేకపోతే వైసిపి ప్రజా ప్రతినిధులపై వరసగా జరుగుతున్న దాడులను ఎలా చూడాలి ? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రోజా పై దాడులు జరిగాయి. బాపట్ల ఎంపి నందిగం సురేష్ మీద రెండుసార్లు దాడులు జరిగింది. సురేష్ మీద జరిగిన దాడిలో అమరావతి జేఏసి మహిళలు అంటూ కొందరు కారం చల్లటమే ఇందుకు నిదర్శనం. మహిళలు తమ దగ్గర అసలు కారం ఎందుకు ఉంచుకున్నట్లు ? ప్రత్యర్ధులపై దాడులు చేయాలని ముందుగా అనుకున్నారు కాబట్టే ప్లాన్డుగా కారం, పెప్పర్ స్ప్రే లాంటివి ఉంచుకుంటున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని విజయసాయి అనటంలో తప్పేముంది ?