కొడాలి నాని... ఏపీ రాజకీయాల్లో బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేత. మూడు సార్లు అదృష్టం బాగోక ప్రతిపక్షానికే పరిమితమైన, నాలుగోసారి మాత్రం అధికారంతో పాటు మంత్రి పదవి కూడా వచ్చేసింది. జగన్ ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రుల్లో ఒక్కరిగా కీ రోల్ పోషిస్తున్నారు. తొలిసారి మంత్రి అయిన త్వరగానే తన శాఖపై పట్టు తెచ్చుకుని ముందుకెళుతున్నారు.
కీలకమైన పౌర సరఫరాల శాఖ మేనేజ్ చేయడం అంత సులువు కాకపోయిన, తనదైన రీతిలో శాఖ మీద అవగాహన చేసుకుని పనులు చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో జాగ్రత్తగా పని చేస్తూ...అర్హులకు అన్యాయం జరగకుండా చూసుకుంటున్నారు. ఇక మంత్రిగా రాణిస్తూనే గుడివాడ ఎమ్మెల్యేగా కూడా మంచి పనితీరు కనబరుస్తున్నారు. మూడు సార్లు ప్రతిపక్షంలో ఉండటం వల్ల కాస్త పనులు చేయడంలో ఇబ్బంది పడినా...ఇప్పుడు మాత్రం అధికారం ఉండటంతో నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటపట్టిస్తున్నారు.
నియోజకవర్గంలో కొత్త సిసి రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు, గ్రామ సచివాలయాల నిర్మాణాలకు పూనుకున్నారు. అటు పెండింగ్‌లో ఉన్న పనులని పూర్తి చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ గుడివాడ బస్టాండుకు కొడాలి నాని చెక్ పెట్టారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితం నిర్మాణం జరిగిన ప్రస్తుత బస్టాండ్ శిధిలావస్థ దశకు చేరుకోవడంతో కొత్త బస్టాండ్ కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దీని కోసం రూ. 21.31 కోట్ల మంజూరుకు అనుమతినిచ్చింది. అంటే త్వరలోనే గుడివాడ ప్రజలు ఓ సరికొత్త బస్టాండుని చూడబోతున్నారు.
ఇక వేసవి సమీస్తుండటంతో ఎప్పటిలాగానే ప్రతి వూరుకు వాటర్ ట్యాంకర్ సప్లై చేయడం మొదలుపెట్టారు. అలాగే కొత్తగా వాటర్ ట్యాంక్ నిర్మాణాలు చేపడుతున్నారు. అభివృద్ధే కాకుండా ప్రభుత్వ పథకాలు కూడా గుడివాడలో బాగా అమలు అవుతున్నాయి. ప్రతి అర్హుడుకు పథకాలు అందుతున్నాయి. అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్స్ అందిస్తున్నారు. అవసరమైతే తన సొంత డబ్బులని కూడా ఖర్చు పెట్టడానికి నాని వెనుకాడటం లేదు.
ఎమ్మెల్యే, మంత్రిగానే కాకుండా నాని మరోపాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీ నేతగా ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ టీడీపీ చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తూ, చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. వీలు కుదిరిన ప్రతిసారి చంద్రబాబుని ఏకీపారేస్తున్నారు. ఈ విధంగా ఓ వైపు ఎమ్మెల్యేగా, మరోవైపు మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్న నాని....ప్రతిపక్ష టీడీపీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. మొత్తం మీద నాని అన్నీ రకాలుగా రాణిస్తూ, జగన్ ప్రభుత్వంలో ఆల్‌రౌండర్‌గా మారిపోయారు.