నారా లోకేష్ రాజకీయ భవితవ్యం గురించి టీడీపీ అధినేత చంద్ర బాబు లో టెన్షన్ పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా తాను యాక్టివ్ గా ఉండగలనా లేదో అనే టెన్షన్ బాబు లో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి ఢోకా లేకుండా చూడాలని బాబు ప్రయత్నిస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో ఘోరంగా ఓటమి చెందడంతో టీడీపీ షాక్ అయ్యింది. అమరావతిని తాము అన్నిరకాలుగా అభివృద్ధి చేశామని గొప్పగా చెప్పుకుంటూ వచ్చిన ఆ ప్రాంతంలోనే లోకేష్ ఓటమి చెందడం చాలాకాలం జీర్ణించుకోలేకపోయారు. అయినా మంగళగిరి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని లోకేష్ ప్రకటించుకున్నాడు. ఆ మేరకు ఆ నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. 

IHG

ప్రస్తుత రాజకీయ వాతావరణం మారడం, వైసీపీ దూకుడు మరింత పెరిగేలా కనిపిస్తుండడంతో మంగళగిరి సేఫ్ కాదనే భావనలో చంద్రబాబు ఉన్నారు. లోకేష్ కు మాస్ ఇమేజ్ లేదు, కేవలం సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాడనే సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఫై నిత్యం విమర్శలు చేస్తూ ఉంటాడు. కానీ లోకేష్ ఉనికి సోషల్ మీడియా వరకు తప్ప కింది స్థాయిలోకి వెళ్లడంలేదు. ఇది ఇలా ఉంటే లోకేష్ మంగళగిరిలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడంలేదు. దీనికి నిదర్శనంగా  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశంలో లోకేష్ భవిష్యత్తుకి సంబందించిన వ్యాఖ్యలు చేస్తున్నారు. 


త్వరలోనే లోకేష్ కుప్పంలో పర్యటిస్తారని ప్రకటించాడు. మంగళగిరి ఎట్టి పరిస్థితుల్లోనూ సేఫ్ కాదని కుప్పం అయితే లోకేష్ సులువుగా గెలుస్తాడని బాబు భావిస్తున్నట్టు ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఇక నుంచి తరచుగా కుప్పంలో లోకేష్ పర్యటనలు ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో లోకేష్ ను రాజకీయంగా యాక్టివ్ చేసేందుకు, కుప్పంలో పట్టు పెంచుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. అంటే మంగళగిరికి లోకేష్ మంగళం పడబోతున్నారని అర్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: