కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేట్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేలో రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న పలు రైలు మార్గాల్లో ప్రైవేట్ రైళ్లకు అవకాశం కల్పించింది. 
 
కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించటం కొరకు, ప్రయాణికుల అవసరాలు తీర్చటం కొరకు రైల్వేలో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఢిల్లీ - లక్నో మధ్య తేజస్ రైళ్లు విజయవంతంగా రాకపోకలు సాగించటంతో 22,500 కోట్ల పెట్టుబడితో 150 రైళ్లను ప్రైవేట్ ఆపరేటర్లు నడపనున్నట్టు రైల్వే ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఏపీకి సంబంధించి ఐదు రూట్లు ఉన్నాయి. ప్రయాణికులకు ప్రైవేట్ రైళ్లలో లగ్జరీ సదుపాయాలు కల్పించనున్నారని సమాచారం. 
 
ప్రైవేట రైళ్లలో విమానాల తరహాలో ఖరీదైన వసతులతో పాటు రైల్ హోస్టెస్‌లు ఉండనున్నట్టు తెలుస్తోంది. డిమాండ్ అధికంగా ఉన్న రూట్లనే రైల్వే శాఖ ఎంపిక చేయడం గమనార్హం. లింగంపల్లి - తిరుపతి, గుంటూరు - లింగంపల్లి, చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య డైలీ ట్రైన్లు విజయవాడ - విశాఖ, విశాఖ - తిరుపతి మధ్య ట్రై వీక్లీ ప్రైవేట్ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమయింది. 
 
త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖ ప్రైవేట్ రైళ్లకు డ్రైవర్లు, గార్డులను అందిస్తుంది. ప్రమాదాలు జరిగితే బీమా, సహాయక చర్యలతో పాటు సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రైవేట్ ఆపరేటర్లదే. రైల్వేలో పెట్టుబడుల కోసం దేశీయ సంస్థలైన అదానీ గ్రూప్, టాటా ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ సంస్థలైన హ్యూండాయ్, అల్స్ట్రామ్, సీమెన్స్ కూడా ప్రైవేట్ రైళ్లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: