దేశ రాజధానికే పరిమితమైన ప్రైవేట్ రైళ్లు...త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూత పెట్టనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి ఏడు రూట్లలో ఐదు రైళ్లను ప్రవేశపెట్టనున్నాయి. రైల్వేల్లో ప్రైవేట్ పెట్టుబడులకు డోర్లు తెరవడంతో....నిత్యం రద్దీగా ఉండే మార్గాల్లో ప్రైవేట్ రైళ్లకు ఆ శాఖ పచ్చ జెండా ఊపింది.  

 

దక్షిణ మధ్య రైల్వేలో ప్రైవేట్‌ రైళ్ల రాకపోకలకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా వంద మార్గాల్లో 150 ప్రైవేట్‌ ప్యాసింజర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న పలు రైలు మార్గాల్లో ప్రైవేట్‌ రైళ్లకు అవకాశం కల్పించింది రైల్వే శాఖ.

 

ప్రస్తుతం ఢిల్లీ - లక్నో మధ్య తేజస్‌ ప్రైవేట్‌ రైళ్లు విజయవంతంగా రాకపోకలు సాగిస్తున్నాయి. రెండో ప్రైవేట్‌ రైలు అహ్మదాబాద్‌- ముంబై మార్గంలో జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చింది. 22 వేల 500 కోట్ల పెట్టుబడితో దేశంలోని వంద మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో ఏపీకి సంబంధించి ఐదు రూట్లు ఉన్నాయి. ప్రైవేట్‌ రైళ్లలో సకల సౌకర్యాలుంటాయని.. విమానాల తరహాలో అత్యంత ఖరీదైన వసతులతో పాటు రైల్‌ హోస్టెస్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. 

 

ప్రయాణీకుల డిమాండ్‌ అధికంగా ఉన్న రూట్లనే ప్రైవేటు రైళ్లకు ఎంపిక చేశారు.చర్లపల్లి - శ్రీకాకుళం, లింగంపల్లి - తిరుపతి, గుంటూరు - లింగంపల్లిల మధ్య డైలీ ట్రైన్లు నడపనున్నారు. ఇక విజయవాడ - విశాఖతో పాటూ, విశాఖ - తిరుపతి మధ్య  ట్రై వీక్లీ ప్రైవేట్‌ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమయింది.

 

ప్రైవేటు రైళ్లలో డ్రైవరు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది. ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు, బీమాతో పాటూ మిగిలిన సౌకర్యాల బాధ్యత మొత్తం ప్రైవేటు ఆపరేటర్లదే. రైల్వేల్లో పెట్టుబడి కోసం విదేశీ సంస్థలపైన  హ్యూండాయ్, సీమెన్స్, ఆల్స్ట్రామ్ ఆసక్తి కనబరుస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.  దేశీయ సంస్థలైన టాటా, అదానీ గ్రూప్‌లు కూడా ప్రైవేటు రైళ్లవైపు  అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: