ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ఆలయంలో భద్రత కొరవడింది. రాత్రి సమయంలో ఆలయానికి, భక్తులకు రక్షణగా ఉండాల్సిన సిబ్బంది నిద్రమత్తులో జోగుతున్నారు. అటు... భద్రతా సిబ్బందిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ద్వారకా తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ద్వారకా తిరుమల ఒకటి. అలాంటి ఆలయానికి భద్రత కరువైంది. రాత్రి వేళ బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శ్రీవారి ఆలయ భద్రత కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. ఏజిల్ గ్రూప్ సెక్యూరిటి సంస్థ ద్వారా ఒప్పంద పద్దతిలో 72 మంది సిబ్బందిని నియమించారు. వీరికి అదనంగా మరో 21 మంది హోంగార్డులు, ఏడుగురు రాత్రి కాపలాదారులు పని చేస్తున్నారు. అందరూ మూడు షిప్టుల్లో డ్యూటీ చేస్తుంటారు. శ్రీవారి ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి రాత్రి 9 గంటలకు మూసివేస్తారు. ఈ సమయంలో ఆలయ ప్రాంగణం, ఉప, దత్తత దేవాలయాలు, టోల్ గేట్‌లు, కాటేజీలు, అన్నదాన భవనం, కేశ ఖండనశాల, సెంట్రల్ స్టోర్ తదితర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. ఐతే...వీరిపై ఆలయ అధికారుల పర్యవేక్షణ కొరవడింది.
ద్వారకా తిరుమల ఆలయంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆలయం తెరిచే వరకు కాపలా కాస్తూనే ఉండాలి. కానీ రాత్రి 11 గంటలు దాటాక కొందరు భద్రతా సిబ్బంది నిద్రావస్థలోకి జారుకుంటున్నారు. శ్రీవారి ఆలయానికి తూర్పు వైపున నిర్మించిన అనివేటి మండపంలో కాలి నడకన వచ్చిన భక్తులు రాత్రి పూట నిద్రిస్తుంటారు. ఇక్కడ శునకాల బెడద పెరిగిపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల కుక్కలు భక్తుల మధ్యే సంచరిస్తున్నాయి. గతంలో శ్రీవారి ఉప, దత్తత ఆలయాల్లో రాత్రి వేళ దొంగతనాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు భక్తులు.
భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని ద్వారకా తిరుమల ఆలయ ఈవో తెలిపారు. ఎప్పటికప్పుడు వారి పని తీరుపై నిఘా పెడతామని చెప్పారు ఈవో. ఇప్పటికైనా భద్రతా సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు భక్తులు.