చంద్రబాబునాయుడు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనపై టెన్షన్ మొదలైంది. ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో చంద్రబాబు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా పెందుర్తి ప్రాంతంలో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుండే విజయనగరం జిల్లాకు వెళ్ళిపోతారు. స్ధూలంగా చంద్రబాబు షెడ్యూల్ ఇదే అయినా మొత్తం టెన్షన్ గా మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులను చంద్రబాబు ఎంతగా వ్యతిరేకిస్తున్నది అందరూ చూస్తున్నదే. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రతిపాదనను చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన చేయలేదు. ఎందుకంటే జగన్ ప్రతిపాదనను మెజారిటి తెలుగుదేశంపార్టీ నేతలు ఆహ్వానించారు.
జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పార్టీ కార్యవర్గంలో వ్యతిరేకించాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగా పట్టుబట్టినా సాధ్యం కాలేదు. పైగా జగన్ ప్రతిపాదనకు సానుకూలంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పార్టీ కార్యవర్గంలోని మెజారిటి నేతలు తీర్మానాలు చేసి చంద్రబాబుకే పంపారు. సరే ఈ విషయంలో పార్టీలోనే గందరగోళ పరిస్ధితులున్నాయి లేండి. అదే సమయంలో విశాఖపట్నం నగర అధ్యక్షుడు రహ్మాన్ లాంటి కొందరు నేతలు పార్టీకి రాజీనామా కూడా చేశారు.
సరే వివిధ కారణాల వల్ల తెలుగుదేశంపార్టీలో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులాగ తయారైంది. సచివాలయాన్ని విశాఖలో ఏర్పాటు రెడీ అయిపోయి, జగన్ కూడా విశాఖపట్నంకు వెళ్ళిపోవటానికి అధికారికంగా ముహూర్తం ప్రకటన జరిగితే అప్పుడు పార్టీల్లో పరిస్దితులు ఒక్కసారిగా మారిపోతాయనటంలో సందేహం లేదు. ఇప్పటికైతే జగన్ విశాఖపట్నంకు వెళ్ళిపోవటానికి డిసైడ్ అయిపోయారు. ప్రభుత్వ, పార్టీలోని ముఖ్యులు కూడా ఈ విషయంలో పర్యటనలు కూడా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు పర్యటన పెట్టుకోవటంతో అందరిలోను టెన్షన్ మొదలైపోయింది. మరి ఏమవుతుందో చూడాల్సిందే.