వైసీపీలో మరోసారి నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. నెల్లూరుకు చెందిన మాజీ ఎంపీ మేక పాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం పెద్దల సభ రాజ్యసభకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నా యి. ఇవి పూర్తిగా అసెంబ్లీలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున వైసీపీకే దక్కనున్నాయి. దీంతో ఏపీ నుంచి ఆ నలుగురు ఎవరు? అనే చర్చ ప్రారంభమైంది. ముగ్గురి మాట ఎలాఉన్నా.. ఒకటి మాత్రం తమకే ఖాయమని నెల్లూరుకు చెందిన మేకపాటి వర్గం మీడియాకు లీక్ చేసింది.
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతోనే నెల్లూరులో లీకుల పర్వం ప్రారంభమైంది. నెల్లూరుకు చెందిన సీనియర్‌నాయకుడు, వైఎస్ కుటుంబానికి ఆప్తుడు, వైసీపీ తరఫున గట్టి గళం వినిపించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఒక సీటు గ్యారెంటీ అని ప్రచారం మొదలైంది. ఇదే ప్రధాన మీడియా లోనూ వచ్చింది. దీంతో ఈ విషయం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి ఒక కుటుంబానికి రెండు పదవులు ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే మేకపాటి తనయుడు గౌతం రెడ్డి మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఆయన తమ్ముడు చంద్రశేఖరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో మేకపాటికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారనేది కొందరి వాదన. దీనికి మేకపాటి వర్గం బాగానే కౌంటర్ ఇస్తోంది. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, ఆయన తన యుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేతగా పదవి ఇచ్చారు కదా? అని ప్రశ్నిస్తు న్నారు. అయితే, వాస్తవం ఏంటంటే.. మేకపాటికి రాజ్యసభ బెర్త్ ఇవ్వాలని ఉన్నప్పటికీ.. జగన్ ఈ విషయంలో తొందరపడడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి మేకపాటి అనారోగ్యంతో ఉన్నారు. పైగా రాజ్యసభలో ఇప్పుడు బలంగా పనిచేసే నాయకులు జగన్కు అవసరం. ఈ నేపథ్యంలో మేకపాటిపై అభిమానం ఉన్నప్పటికీ.. రాజ్యసభ రేసులో ఆయన పేరు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.