శ్రీనివాస రామానుజన్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేధావుల్లో ఒకరు. 1887 సంవత్సరం డిసెంబర్ 22న కోమలటమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు రామానుజన్ జన్మించారు. రామానుజన్ తండ్రి ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. బాల్యం నుంచి గణితం అంటే అభిరుచిని కనబరుస్తూ తన ప్రతిభతో రామానుజన్ ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవారు. పన్నెండేళ్ల వయస్సులో త్రికోణమితి, ఆయిలర్ సమస్యలను సులువుగా సాధించటంతో పాటు సీనియర్లకు గణితంలో సందేహాలు వస్తే వాటిని పరిష్కరించేవారు. 
 
గణితం మీద ఎంతో శ్రద్ధ పెట్టే రామానుజన్ మిగతా సబ్జెక్టులను మాత్రం నిర్లక్ష్యం చేసేవారు. సబ్జెక్టులపై దృష్టి పెట్టకపోవడంతో ఎఫ్.ఏ పరీక్ష తప్పిన రామానుజన్ అనంతరం మద్రాస్ లోని పచ్చయ్యప్ప కాలేజీలో చేరారు. 15 ఏళ్ల వయస్సులో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం పరిష్కరించలేని సిద్ధాంతాలను రామానుజన్ తన పద్ధతిలో సాధించారు. లెక్కల వల్ల కొడుక్కి పిచ్చి పడుతుందని భావించిన రామానుజన్ తండ్రి ఆయనకు పెళ్లి చేశారు. 
 
పెళ్లి తరువాత సంసారం గడవటం కోసం రామానుజన్ గుమస్తాగా చేరారు. గణితంపై ప్రేమతో చిత్తు కాగితాలపై కూడా లెక్కల సాధన చేశారు. మద్యాస్ విశ్వవిద్యాలయం రామానుజన్ అసాధారణ ప్రతిభ తెలిసి ఆయనకు డిగ్రీ లేకపోయినా 75 రూపాయల ఫెలో షిప్ మంజూరు చేసింది. 1913లో ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వాకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయి అతని సిద్ధాంతాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.హెచ్.హార్డీకి పంపారు. 
 
హార్డీ ఆహ్వానంతో లండన్ వెళ్లిన రామానుజన్ గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ది ట్రినిటీ గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగాను ఆయన చరిత్రకెక్కారు. 1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. రామానుజన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో హర్డీ తాను వచ్చిన కారు నంబర్ 1729.. ఆ నంబర్ చూడటానికి చాలా డల్ గా కనిపిస్తుందని చెప్పారు. 
 
రామానుజన్ వెంటనే 1729 ( (1729 = 1^3 + 12^3 = 9^3 + 10^3) రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముతో వ్రాయబడే అతి చిన్న సంఖ్య అని చెప్పటంతో హార్డీ ఆశ్చర్యపోయారు. మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన రామానుజన్ పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యం గురించి లెక్క చేయకపోవడంతో 1920, ఏప్రిల్ 26న పరమపదించారు. రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: