మీకు పరోటాలంటే ఇష్టమా...? ఎన్ని పరోటాలు పెట్టినా తినే సామర్థ్యం ఉందా...? అయితే మీకో శుభవార్త. కేవలం మూడు పరోటాలు తిని లక్ష రూపాయలు ప్రైజ్ మనీ గెలవచ్చు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా కేవలం మూడు పరోటాలు తింటే లక్ష రూపాయల నగదుతో పాటు జీవితాంతం ఫ్రీ ఫుడ్ తినే అవకాశాన్ని ఒక హోటల్ కల్పిస్తోంది. కానీ ఆ పరోటాలు సాధారణ పరోటాల పరిమాణంలో కాకుండా పెద్ద సైజులో లభిస్తాయి.
హర్యానాలోని తపస్య హోటల్ లో పెద్ద సైజు పరోటాలు జంబో పరోటాల పేరుతో లభిస్తాయి. పోటీలో పాల్గొనేవారు కేవలం 50 నిమిషాల్లో 3 జంబో పరోటాలు తినాలి. హోటల్ ప్రారంభమైనప్పటి నుండి ఇక్కడ పరోటాల ఛాలెంజ్ జరుగుతోంది. ఒక్కో జంబో పరోటా ఖరీదు 300 రూపాయలు. సాధారణంగా ఒక జంబో పరోటా ఐదుగురికి సరిపోతుంది. రెండున్నర అడుగుల మందం ఉండేలా ఈ పరోటాలను తయారు చేస్తారు.
50 నిమిషాల్లో 3 పరోటాలు తిన్నవారు ప్రైజ్ మనీతో పాటు జీవితాంతం హోటల్ లో ఫ్రీ ఫుడ్ తినే అవకాశం ఉండటంతో పందెంలో పాల్గొనటానికి అధికసంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. హోటల్ ప్రారంభమైనప్పటి నుండి వేల సంఖ్యలో పోటీలో పాల్గొన్నా కేవలం ఇద్దరు మాత్రమే ఈ పందెం నెగ్గారు. జంబో పరోటాను స్వచ్ఛమైన నెయ్యితో కాల్చి రెండు కిలోల కూర్మా వేసి కస్టమర్లకు ఇస్తారు.
ఈ హోటల్ లో ఒక మీడియం పరోటా ధర 90 రూపాయలు. హోటల్ యజమాని పందెం గురించి మాట్లాడుతూ జంబో పరోటాలను తినడానికి ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నారని తెలిపారు. ఈ పందెం వల్ల తమ హోటల్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. పందెంలో గెలిచిన వారికి ప్రైజ్ మనీతో పాటు జీవితాంతం ఫ్రీ ఫుడ్ అందిస్తూ ఉండటంతో హోటల్ కు వచ్చే వారి సంఖ్య పెరిగిందని అన్నారు.