దేశంలో రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అకాల వర్షాలతో రైతులు నిండా మునుగుతున్నారు. పంట బాగా పండినా గిట్టుబాటు ధరలు లేక పంటను గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకునే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా నిలుస్తూ రైతులకు భరోసా కల్పిస్తూ ఉండటంతో గతంతో పోలిస్తే రైతుల పరిస్థితి కొంత మెరుగైంది.
కేంద్రం, తెలుగు రాష్ట్రాలు రైతుల సంక్షేమం కోసం రైతు బీమా, రైతు బంధు, కిసాన్ సమ్మాన్ నిధి, రైతు భరోసా ఇతర పథకాలను ప్రవేశపెట్టాయి. తాజాగా ప్రధాని మోదీ రైతులకు ప్రయోజనం చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు ఈ కార్డులను అందిస్తాయి. బ్యాంకులు రైతులకు ఈ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను అందజేస్తాయి.
కేంద్రం రైతులకు అధిక వడ్డీల భారం నుండి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డుపై రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. రైతులు గతంలో తీసుకున్న రుణాలను గడువులోపు కడితే బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. ఎలాంటి తనఖా లేకుండా ఈ కార్డ్ ఉన్న రైతులు 1,60,000 రూపాయల వరకు రుణం పొందవచ్చు.
బ్యాంకులు గడువులోపు రుణాలు చెల్లించిన వారికి సాధారణ వడ్డీని వసూలు చేస్తాయి. రైతులు గడువులోగా రుణాలు చెల్లించకపోతే మాత్రం చక్రవడ్డీ పడుతుంది. ఈ కార్డు ద్వారా తీసుకున్న రుణంతో పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కవరేజ్ కూడా లభిస్తుంది. బ్యాంకులకు వెళ్లి ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ బ్యాంకు ఈ రుణాలను ఇప్పటికే అందిస్తోంది. https://www.pmkisan.gov.in/ లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్లను జత చేసి బ్యాంకుకు వెళ్లి అందజేసి రుణం పొందవచ్చు.