గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో కార్యకర్తలతో పాటు అధినేత చంద్రబాబు కూడా తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయాడు. పార్టీ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుండటంతో.. వయసు సహకరించకపోయినా తన శక్తికి మించి చంద్రబాబు పార్టీ కోసం, నాయకుల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా తన రాజకీయ వారసుడు లోకేష్ కోసం చంద్రబాబు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ ఓటమి చెందడం, అదికూడా మొదటిసారిగా పోటీచేసిన చోట.. ఐదేళ్ల పాటు తాము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న అమరావతి ప్రాంతంలోనే లోకేష్ ఘోర పరాజయం చెందడం చంద్రబాబు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఇప్పటికీ లోకేష్ రాజకీయంగా సమర్థుడు అని నిరూపించేందుకు చంద్రబాబు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలోనే లోకేష్ కు ఓ ప్రత్యేక ట్రైనర్ ను లక్షలు జీతం పెట్టి మరీ ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఇప్పుడు కొత్తగా మరో ట్రైనర్ ను తీసుకువచ్చారు. ఆయనతో రాజకీయ పాఠాలు, ప్రసంగాలు ఇలా అన్నింటిని నేర్పిస్తున్నారు. అయినా లోకేష్ లో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు అని చంద్రబాబు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. పార్టీలో తాను తప్ప మరెవరు ఎదగకూడదు అనే సూత్రాన్ని చంద్రబాబు సమర్థవంతంగా అమలు చేయడంతో ఇప్పుడు టిడిపిలో నాయకత్వ సమస్య ఏర్పడింది.
లోకేష్ మీద ఒక్కరికి నమ్మకం లేకపోవడంతో ఇంకా ఆయనను పసివాడిగానే అందరూ చూస్తూ ఉండడం, లోకేష్ కు ఇబ్బందికరంగా మారింది. ఆయనకు క్షేత్ర స్థాయిలో పార్టీపై పట్టు లేకపోవడం, ప్రసంగాల్లో తడబడుతూ మాట్లాడుతూ అభాసుపాలవ్వడం పరిపాటిగా మారింది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ వైసిపి జనాల్లో ఆదరణ పెంచుకుంటూ దూసుకు వెళ్తున్నా లోకేష్ సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతున్నారు. ఇప్పుడు లోకేష్ భార్య నారా బ్రాహ్మణి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. ఆమె యాక్టివ్ అయితే లోకేష్ కు ఇబ్బందే. ఎందుకంటే మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డగా ఉన్న లోకేష్ ఇప్పుడు భార్య చాటు భర్తగా పిలుపులు అందుకోవడం తప్పేలా కనిపించడంలేదు.