ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గ్రామ, వార్డ్ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లుగా పని చేస్తున్న వారిలో 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారని చెప్పారు. నారా లోకేశ్ ఈరోజు ట్విట్టర్ ఖాతాలో వాలంటీర్లపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. గ్రామ, వార్డ్ వాలంటీర్లు పాపాలు చేసినా, అత్యాచారాలు చేసినా వారికి వైసీపీ ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. 
 
దండుపాళ్యం గ్యాంగుల్లా సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను వాలంటీర్లు పూర్తి చేస్తున్నారని వైసీపీ వాలంటీర్లకు హ్యాట్సాఫ్ చెప్పడంలో వింత ఏముందని అన్నారు. వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి గ్రామ, వార్డ్ వాలంటీర్లకు హ్యాట్సాఫ్ చెబుతూ ట్వీట్లు చేశారు. విజయసాయి రెడ్డి రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్లలో ఒక్కరితో కూడా చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ సరితూగలేరని అన్నారు. 
 
వాలంటీర్లు సైనికుల్లా జగన్ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, వాలంటీర్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని చెప్పారు. నిన్న సెలవురోజైనప్పటికీ వాలంటీర్లు 87.37 శాతం ఫించన్లను రాష్ట్రంలో పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఒకటో తేదీనే వాలంటీర్లు ఇంటికి వచ్చి ఫించన్ అందజేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో కొన్ని ప్రాంతాలలో మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు. 
 
గతంలో వృద్దులు, దివ్యాంగులు రోజుల తరబడి ఫించన్ల కోసం క్యూలైన్లలో ఎదురు చూడాల్సి వచ్చేది. సీఎం జగన్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టటం, ఒకటో తేదీనే అర్హులకు ఫించన్ అందేలా ఆదేశాలు జారీ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వాలంటీర్ల సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్లు చేయగా నారా లోకేష్ వాలంటీర్లను దండు పాళ్యం గ్యాంగుతో పోల్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: